నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో జక్రాన్ పల్లి మండలం పుప్పాల పల్లి గ్రామానికి చెందిన కుందాపురం నర్సయ్య, నీలపు రమేష్ లకు జీవితఖైదు విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు. తీర్పులోని వివరాల ప్రకారం…. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పుప్పాల పల్లి గ్రామ నివాసులైన కుందాపురం నర్సయ్య, నీలపు రమేష్ స్నేహితులు. 2023 అక్టోబర్ 14 న ఇద్దరు కలిసి బైక్ పైన ఘన్పూర్ గ్రామానికి వెళ్లి కల్లు తాగి బైక్ పై తిరిగి వస్తు మార్గం మధ్యలో గన్యా తాండాలో మోహన్ కిరాణా షాప్ లో మద్యం కొనుగోలు చేసుకున్నారు. అక్కడ వారి గ్రామానికి చెందిన చాట్ల మహేష్ కూడా క్వార్టర్ లిక్కర్ బాటిల్ కొనుగోలు చేయగా అతని నలభై రూపాయలు తక్కువగా ఉండటంతో రమేష్ ఇచ్చారు. ముగ్గురు కలిసి పుప్పాల పల్లి చెరువు దగ్గరకు మద్యం తాగుతుండగా మహేష్ తన సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడు చుండగా.. నర్సయ్య అరేయ్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అన్నందుకు మహేష్ నీకు ఎందుకు రా.. అని అరిచాడు.ఎందుకు అరుస్తున్నావు అని బూతు మాట అనగా మహేష్ నర్సయ్య చెంప పైన చేతితో కొట్టి నన్ను ఎందుకు అడుగుతున్నావు అనడంతో కోపోద్రిక్తులు అయిన నర్సయ్య మహేష్ ను చేతితో కొట్టి, పక్కన ఉన్న కట్టేతో తల పైన ఇతర శరీర భాగాల పైన కొట్టగా గొడవను ఆపేందుకు వచ్చిన రమేష్ ను తిట్టగా ఇద్దరు కలిసి కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. కొన ఊపిరితో ఉన్న మహేష్ ను ఇక్కడే వదిలేస్తే గ్రామంలో పంచాయతీ పెట్టి నిలదీస్తారు బావించిన నర్సయ్య, రమేష్ లు చేతులు ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకుని కొన ఊపిరితో ఉన్న మహేష్ ను చెరువులో పడవేశారు. అతని అనవాళ్లు కనబడకుండా బైక్ , సెల్ ఫోన్ ను చెరువులో వేశారు. మందు బాటిల్ ను, కట్టెను పొదల్లో వేశారు.ఆర్మూర్ పోలీస్ సర్కిల్ సీఐ కృష్ణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేసి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. కోర్టు నేర న్యాయ విచారణ భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసి, ధ్రువీకరించు కున్న పత్రాలు,వస్తుగత సాక్ష్యాలను మార్క్ చేసుకున్న కోర్టు ముద్దాయి తరఫున న్యాయవాదులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరజారెడ్డి వాదనలు విన్నారు. ముద్దాయి లపై మోపిన హత్య కేసు రుజువు అయినట్లు కోర్టు నిర్ధారించింది .ముద్దాయిలు నర్సయ్య, రమేష్ లకు భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 హత్య నేరం ప్రకారం జీవిత కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినందుకు గాను సెక్షన్ 201 నేరంకు గాను మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. రెండు శిక్ష ఏకకాలంలో అనుభవించాలని జడ్జి దుర్గా ప్రసాద్ తన తీర్పులో వ్రాశారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరజ రెడ్డి తెలిపారు.

