
. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి
. జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు
. మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, నిరంతర నిఘా సారించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించగా బోధన్, అర్బన్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై చర్చించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పోలీస్, ఎక్సైజ్, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నిజామాబాద్ మీదుగా గంజాయిని అప్పుడప్పుడు మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున నిఘా సారించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా గంజాయి రవాణా చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ, రైల్వే అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గంజాయి విక్రయించే, వినియోగించే వారికి కఠిన శిక్ష పడేలా కోర్టులకు సమగ్ర ఆధారాలు సమర్పించాలన్నారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వలను వెలికితీయాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు అలవాటుపడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటకు తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో డీ-అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ తన చాంబర్ లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటుపై సంబంధిత అధికారులు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు విశాల్ తో ప్రత్యేకంగా చర్చించారు. సెంటర్ ఏర్పాటు దిశగా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సహాయ సూపరింటెండెంట్ డీసీబీ నాయక్, డీఎంహెచ్ వో రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
