25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మంచి సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులమవుదాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మూడు వ్యవస్థల కలయికతో మంచి సమాజ నిర్మాణం

 

. . . తాళ్ళ రాంపూర్ గ్రామం స్ఫూర్తినిచ్చింది

 

. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ 

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:

 

న్యాయమూర్థులు, న్యాయవాదులు, నాయ్య సిబ్బంది సమిష్టిగా మనసులో సంకల్ప బలం చేసుకుని మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు అవరణలో వార్షిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జీ భారత లక్ష్మి మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు న్యాయవాదులు, ఉద్యోగులే మూల స్తంభాలని పేర్కొంటూ, వారి వల్లనే న్యాయమూర్థులు అద్భుతంగా పని చేయడానికి కారణభూతులు అవుతున్నారని ఆమె అన్నారు. న్యాయ వివాదాలను పరిష్కరింప చేయడంలో న్యాయవాదుల పాత్రనే ఎక్కువని తెలిపారు. పని విధానంలో ఒత్తిడికి ఎక్కువ గురి కాకుండా మసలుకోవాలన్నారు. జిల్లాకోర్టు సముదాయంలో లిఫ్ట్ ల సమస్య తీరిందని, 250 సిసి టివి కెమెరాలతో అందరి పని విధానం పర్యవేక్షణలో ఉన్నదని వివరించారు. కోర్టుల సంఖ్య పెరగడం దానికి అనుగుణంగా అందరి రాకపోకలు పెరిగిన నేపథ్యంలో వాహనాల రద్దీని తట్టుకోవడానికి వీలుగా జిల్లాకోర్టుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. జ్యూడిషియారీ, పరిపాలన, పోలీసు వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తే మరింత అభివృద్ధి వైపు వెళతామని ఆమె అభిప్రాయ పడ్డారు. జ్యూడిషియరీ, పోలీసుల మధ్య కొంతకాలం క్రితం నిర్వహించిన క్రికెట్ పోటీలో ఫిట్ నెస్ గా ఉంటారనుకున్న పోలీసు టీమ్ ను జ్యూడిషియరీ టీమ్ ఓడించిన తీరును ఎరుకజేసి ఫిట్ నెస్ అన్నోళ్లను పిండి జేసిన వైనాన్ని ఆమె తన హాస్య ధోరణిలో వివరించారు. విధులలో, క్రీడలలో శల్య సారద్యం పనికి రాదని గెలుపు దిశగా పయనం ఉండాలన్నారు. న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు మొట్టికాయలు వేస్తుందని హాస్యోక్తి విసురుతు గౌరవనీయ కోర్టు ఆదేశాలను న్యాయవాదులు, న్యాయమూర్థులుగా సిరిసావహించి కేసుల కట్టలను కరిగిద్దామని జిల్లాజడ్జి భారత లక్ష్మీ అన్నారు. జిల్లాలో ఎక్కువ న్యాయ వివాదాల కేసులను పరిష్కరిస్తున్న తీరును జూసిన హైకోర్టు ప్రంశంసల పూలవాన కురిపించిందని తెలిపారు. కొన్ని గ్రామ అభివృద్ధి కమిటీల చట్టావ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ విజయవంతం అయిందని అన్నారు. ఏర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామంలో విడిసి కి గ్రామ ఒక ప్రజా సమూహానికి మధ్య నెలకొన్న వివాదం హైకోర్టు దృష్టికి వెళ్లిన దృష్ట్యా ఆ వివాదాన్ని గ్రామంలో ప్రజలతో బహిరంగ సమావేశం పెట్టి పరిష్కరించిన ఉదాంతాన్ని ఆమె తెలుపుతు జిల్లా న్యాయసేవ సంస్థ చైర్ పర్సన్ గా గర్వపడుతున్నని తెలిపారు. కల్మషాలు లేని, కక్షలు కార్పణ్యాలు లేని మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కంకణబద్దులం కావాలని ఆమె ఆకాక్షించారు.

. . . మాటలు, పాటలతో ఆన్యువల్ డే అదుర్స్

నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం వేసవి వేకేషన్ కు ముందు సంప్రదాయంగా నిర్వహించే అనువల్ డే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు మాటలు, పాటలు, హాస్యోఖ్తులతో కొనసాగి విందుతో ముగిసింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ వార్షికోత్సవ దినోత్సవం సంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటూ వస్తున్నామని తెలిపారు. రోజు కలుస్తున్న, కొన్నిసార్లు కలుస్తున్నా సంవత్సరానికి ఒకసారి అందరం కొన్ని గంటల పాటు కలిసిమెలిసి కలియ తిరిగి మాట్లాడుకోవడం జరుగుతోందని అన్నారు. బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి అనువల్ డే కు సంధానకర్తగా నిలిచి కార్యక్రమాన్ని కొనసాగించారు. జిల్లాజడ్జి భారత లక్ష్మీ, అదనపు జిల్లాజడ్జి దుర్గా ప్రసాద్ కలిసి పాడిన పాట ఎన్నోన్నో జన్మల బంధం నీది నాది… అదనపు జిల్లాజడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ ఒంటరిగా పాడిన పాట ముసి ముసి నవ్వులలో న కురిసిన పూల వాన.. అందరి నోట పాటల పల్లవిగా మోగింది. మొదట సీనియర్ న్యాయవాది మంచికట్ల గోవర్ధన్ చే బార్ అండ్ బెంచ్ మధ్య ఉన్న, ఉండాల్సిన నాలుగు మంచిమాటల మూటను బార్ అసోసియేషన్ వినిపించింది. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు హరీష, సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జూనియర్ సివిల్ జడ్జిలు అంగరి చైతన్య, హరి కుమార్, పాముజుల శ్రీనివాస్ రావు, కీర్తి రాజ్, బార్ ఉపాధ్యక్షు డు ఆవుల నారాయణ రావు, కోశాధికారి మధుసుధన్ గౌడ్, క్రీడల కార్యదర్శి పుణ్యరాజ్, లైబ్రరీ కార్యదర్శి బైర గణేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article