. . . రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం మండల అధ్యక్షుడు చింతల కిషన్ అధ్యక్షతన నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే విస్తృతంగా మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఎదగడానికి నాయకులు, కార్యకర్తల కృషే ప్రధాన కారణమని అన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన ఇందల్వాయి మండలంలో గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కష్టానికి తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి, కర్సా మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ సమావేశంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. నేను డాక్టర్ కాబట్టి సున్నితంగా ఉంటానని అనుకోవద్దు.. మంచివారికి మంచివాడిని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారి పక్షాన ఎప్పుడూ నిలబడతానని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ పోరాడుతోందని, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. పార్టీ నాయకులందరూ అన్నదమ్ముల్లా ఐక్యంగా పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయాల కంటే పూజలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల ప్రధాన బాధ్యత అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించిన ఎమ్మెల్యే, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులే ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఎమ్మెల్యే విమర్శలు చేశారు. దేశ భవిష్యత్, యువత అవసరాలపై కేంద్రం సరైన దృష్టి పెట్టడం లేదని అన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ ఆస్తులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు మరింత చైతన్యంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ గౌడ్, బాల్ రాజు, పొలసాని శ్రీనివాస్, వెంకట్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇందల్వాయి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు పాల్గొన్నారు.

