25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నవ్విపోదురు గాక మాకేంటి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రతి యేటా ప్రవేశాల తగ్గుదల
  • సర్కారు బడులలో నామ మాత్రపు బడిబాట
  • ఈ యేడాది బడిబాటలో నమోదైంది 258 మందే

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సర్కారు బడులలో చేరే విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ముగింపు తర్వాత నిర్వహించే ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా బడి బయట ఉన్న పిల్లలను స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమం విద్యాశాఖ నిర్వహిస్తుంది. సాధారణంగా వేసవి సెలవులు జూన్ 12 వరకు ఉంటాయి. అయితే విద్యాశాఖ మాత్రం సర్కారు ఉపాధ్యాయులకు తాము బోదిస్తున్న పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రతియేటా బడిబాట కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విద్యా సంవత్సరం 1156 ప్రభుత్వ పాఠశాలలకు గాను అడ్మిషన్లు జరిగిన పాఠశాలలు 28 మాత్రమే అని లెక్కలు తేల్చాయి. ఈ నెల 12న 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా అడ్మిషన్లు అయ్యే వారి సంఖ్య 258కి మించలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా బడిబాటలో జిల్లా వ్యాప్తంగా జరిగితే అడ్మిషన్ల సంఖ్య 300కు తక్కువగా ఉండడం విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లోపామా అన్న చర్చ జరుగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, ఇతర పనులను అప్పగిస్తుండడంతో ఎవ్వరూ కూడా బడిబాటను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నెల 6న ప్రారంభమైన బడిబాటలో ఉపాధ్యాయుల్లో తమకు నూతనంగా అడ్మిషన్లు చేయించకపోతే ఏం కాదన్న ధీమాతోనో, నిర్లక్ష్యమో తెలియదు కానీ ప్రభుత్వ, ఎయిడెడ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో కొత్త విద్యార్థుల చేరికకు ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదు.

నిజామాబాద్ జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరంలో 1,14,277 మంది విద్యార్థులు చదువుతున్నట్లు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో 101288 మంది విద్యార్థులు చదివారు. 2023-24లో 89,764 మంది విద్యార్థులు చదువుకుంటే గతేడాది 84062 మంది మాత్రమే చదివినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతంలో సర్కారు బడులలో ఉచిత విద్య, మధ్యాహ్నం భోజనం, మంచి ఫలితాలు, ఉచితంగా యూనిఫారాలు ఇస్తుండడంతో ప్రైవేట్ కు ధీటుగా చదువులు ఉండడంతో బడిబాటకు అపూర్వ స్పందన లభించేది. ఆనాటి వసతులు మించి విద్యార్థులకు ఉచిత సేవలను అందిస్తున్న మెరుగైన ఫలితాలతో ప్రైవేట్ కు ధీటుగా బోధన జరుగుతున్నా విద్యార్థులు చేరకపోవడంపై పలు విమర్శలున్నాయి. విద్యార్థులు లేరని పాఠశాలలను మూసివేస్తే గగ్గొలు పెట్టే ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థులను చేర్పించే విషయంలో ఎందుకు చొరవ చూపించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో బోధనతో వేతనాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు కొందరు సొంత వ్యాపకాలకు పరిమితమై మరికొందరు బిజినెస్ టీచర్లుగా ఎదుగుతున్నారు కానీ సర్కారు పాఠశాలలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

సర్కారు బడులలో విద్యార్థులను చెర్పించే విషయంలో జిల్లా, మండల విద్యాశాఖాధికారుల చొరవ లేదని తేట తెల్లమైంది. బడి బాటలో విద్యార్థులను చేర్పించకపోతే తమకు జరిగే నష్టం లేదని ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. బడి ఈడు పిల్లలు ఇటుక బట్టీలలో, బాల కార్మీకులుగా తమ పాఠశాలల పరిధిలో పనిచేస్తున్న వారిని బడి బాటలో పట్టించేవారు కరువయ్యారు. అంగన్ వాడీలలో చదువుతున్న చిన్నారులను ప్రైమరీలో చేర్చుకుంటే ఒక పని అయిపోతుందని ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయుల తీరుగా మారింది. అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్  తరగతులలో చేరేవారి సంఖ్య అసలు కనిపించడం లేదు. జిల్లాలో 5 రోజులలో 28 పాఠశాలల్లో 258 మంది విద్యార్ధులు కొత్త గా చేరారంటే ఉపాధ్యాయుల పనితనం కనిపిస్తుంది. జిల్లాలో ఉపాధ్యాయుల పనితీరు నానాటికి తీసికట్టుగా మారడంతో పాటు విద్యార్ధులు లేరని పాఠశాలల సర్ధుబాటు చేయడంతో పాటు పాఠశాలల విలీన అవకాశాలు పొంచి ఉన్న ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమైంది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ ఏడాది బడిబాటపై  ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More articles

Latest article