29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపటి నుండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శనవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు ముందస్తు సమావేశం నిర్వహించారు.  సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని, గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని తెలిపారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు  తీసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయని, ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విదంగా సహకరించాలని కోరారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలన్నారు. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు.  అవసరమైన నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనదని మంచి పేరు ఉన్నదని అన్నారు.  చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ.. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సభా నిర్వాహణకు ఇబ్బందులు లేకుండా, సజావుగా జరిగే విదంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు.

More articles

Latest article