జిల్లా కలెక్టర్ కు పీడీఎస్యూ వినతి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : మాక్లూర్ కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే దళిత విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ గౌతమిరెడ్డిపై, ఇందుకు అనుమతించిన ఎస్.వో పై బాలికల సంరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ మాక్లూర్ కేజీబీవీలో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న గౌతమిరెడ్డి తన బంగారు గొలుసు పోయిందని విద్యార్థినిలనందరినీ భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు. అంతటితో ఆగకుండా సహస్ర అనే 6వ తరగతి విద్యార్థినిని ఎస్.ఓ. సహకారంతో నిజామాబాద్, మాలపల్లిలో గల ఫకీరు దగ్గరికి తీసుకు వెళ్లి మంత్రాలు (అంజనం) చేయించడం దుర్మార్గమన్నారు. సహస్ర క్లాస్ టీచర్ (హిందీ) తీసుకువెళ్లవద్దని వారించినా, ఎస్.ఓ కల్పించుకొని నీకెందుకు, నేను పర్మిషన్ ఇస్తున్నాను అని, సీఆర్టి గౌతమితో సహస్రను ఆటోలో పంపిందన్నారు. సహస్ర తల్లిదండ్రులకు ఎలాంటి కనీస సమాచారం లేకుండానే, టీచర్ గౌతమి ఒక వర్కర్ సహాయంతో సహస్రను ఫకీరు దగ్గరికి తీసుకెళ్లిందన్నారు. మాలపల్లిలో ఫకీరు సహస్రకు ఏవో లేపనాలు పూసి, అంజనం వేసి భయభ్రాంతులకు గురి చేశాడన్నారు. అప్పటినుండి విద్యార్థిని సహస్ర తీవ్ర భయభ్రాంతులకు గురవుతుందన్నారు. ప్రస్తుతం తనను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారని తెలిసిందన్నారు. ఇప్పటికే మాక్లూరు కేజీబీవీ ఎస్.ఓపై అనేక ఫిర్యాదులు, పత్రికా కథనాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుత ఘటనలో టీచర్, ఎస్.ఓ ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ భావజాలాన్ని పెంచాల్సిన టీచర్లే ఇలా మూఢనమ్మకాలను ఆశ్రయించడం దారుణమన్నారు. వీరి చర్య బాలల సంరక్షణ చట్టం ప్రకారం సీరియస్ నేరమని, మంత్రాల పేరుతో విద్యార్థులలో అశాస్త్రీయ భావజాలాన్ని నింపడం కూడా చట్టప్రకారం నేరమన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన టీచర్, ఎస్.వోలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి భావజాలాన్ని, దుర్ఘటనలను నియంత్రించాలని అందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలలో తగు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. నాయకులు నాగేష్, నసిర్, సృజాన్, సంతోష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post