- డిసిసిబి వైస్ చైర్మన్ ఎంపికపై కుదరని అభిప్రాయం
- వైస్ చైర్మన్ పదవి కోసం రెండు జిల్లాల డైరెక్టర్ల పట్టు
- వైస్ చైర్మన్ ఎంపిక జరగకుండానే సమావేశం వాయిదా
నిజామాబాద్, బతుకమ్మ : నాలుగు నెలల పదవి కాలం ఉన్న డీసీసీబీ వైస్ చైర్మన్ ఎంపిక పై డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వైస్ చైర్మన్ ఎంపిక కోసం నిర్వహించిన సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. నిజామాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డి చైర్మన్ కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఈ నెల 9న డిసిసిబి నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎంపిక కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ పదవి కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల డైరెక్టర్లు పట్టుబట్టారు. కామారెడ్డి జిల్లా నుంచి సిద్ధి రాములు, నిజామాబాద్ జిల్లా నుంచి బొర్గం శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ పదవి కోసం బరిలో ఉండేందుకు ఆసక్తి చూపారు. మంగళవారం నామినేషన్లు స్వీకరించగా ఏకాభిప్రాయంతో వైస్ చైర్మన్ ఎంపిక చేయాలని డైరెక్టర్లు సమావేశం కాగా ఇద్దరు నేతలు కూడా ఆ పదవి తమకే కావాలని భీష్మించుకు కూర్చున్నారు. గతంలో డిసిసిబి చైర్మన్ ఒక జిల్లాకు వైస్ చైర్మన్ మరో జిల్లాకు అనే సాంప్రదాయం ఉండేది. అంతేకాకుండా ఐడీసీఎంఎస్ పదవులు కూడా డిసిసిబి ప్రాతిపదికన పంచుకునేవారు. కానీ ఇటీవల డిసిసిబి ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవులు నిజామాబాద్ జిల్లాకి దక్కాయి. దీంతో కామారెడ్డి నేతలు కచ్చితంగా వైస్ చైర్మన్ పదవి తమ జిల్లాకే కావాలని పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశం సుదీర్ఘంగా సాగడంతో కాలాతీతం అవుతుందని బ్యాంక్ సీఈఓ వెళ్లిపోవడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ప్రస్తుతానికి వైస్ చైర్మన్ ఎంపిక కోసం సమావేశం ఎప్పుడు అన్నది నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసిసిబిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ జిల్లాలో పెద్దదిక్కుగా ఎవరికి మంత్రి పదవి లేకపోవడం పిసిసి చీఫ్ జిల్లా చెందినవారైనప్పటికీ డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చలేకపోయారన్న వాదనలు ఉన్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ పదవి కోసం రెండు జిల్లాల డైరెక్టర్లు తమకే ఆ పదవి దక్కాలని కోరుతూ ఉండడంతో ఇప్పట్లో వైస్ చైర్మన్ ఎంపిక ఉండదని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పాలకమండలి పదవి కాలం ఉండగా నేతలు మాత్రం ఖచ్చితంగా వైస్ చైర్మన్ కుర్చీ కోసం కలహించుకోవడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.