29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేజీబీవీ, భవిత కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారులతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ సమీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన భవిత సెంటర్ ల నిర్మాణాలు, మరమ్మతు పనులను, కస్తూర్బా విద్యాలయాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన అన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం భవిత సెంటర్లు, కేజీబీవీ నిర్మాణాలు, పీఎంశ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుద్ధిమాంద్యం, మానసిక రుగ్మత వంటివి కలిగి ఉన్న పిల్లలు కూడా సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవాలనే ఉదాత్తమమైన ఆశయంతో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నూతనంగా చేపట్టిన నిర్మాణాలతో పాటు, ఇతర సెంటర్ల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గది వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. నందిపేటలో చివరి దశలో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయించాలని అన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన పనులలో తీవ్ర జాప్యం జరుగుతోందని, వెంటనే పనులు పూర్తి చేసి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని, పైప్ లైన్ లీకేజీలు లేకుండా, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి నివాస ప్రాంతంలో చివరి వరకు తాగునీరు సరఫరా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం ఈ.ఈ రవీందర్, ఏ.ఈ ఉదయ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

KGBV and Bhavitha centers must be completed on a war footing.

More articles

Latest article