. . . బీఆర్ఎస్ కు, మీకు తేడా ఏమిటి
. . . ఏఐకేఎమ్ఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో నిన్న ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధి గురించి ఎంతో గంభీరంగా మాట్లాడిన మీరు జిల్లాలో గల చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారని, మరి మీకు గతంలో పాలించిన బీఆర్ఎస్ కు తేడా ఏమిటని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా అధ్యక్షులు వేల్పుర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో గల సాయి నగర్ లోని ఆకుల హనుమంత్ కమ్యూనిటీ హాలులో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వేల్పుర్ భూమయ్య మాట్లాడారు. జిల్లా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ జిల్లా నా మదిలోనే ఉందని మాట్లాడిన ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మేం అధికారంలోకి రాగానే ఎన్ఎస్ఎఫ్ బోధన్ చక్కని పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారని, అందుకు అసెంబ్లీలో పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు చైర్మన్గా సబ్ కమిటీని వేసిన ఆ సబ్ కమిటీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీ లను పరిశీలించి ఇలా అనంతరం ప్రభుత్వానికి తమ నివేదికను సబ్ కమిటీ సమర్పించిందని వారన్నారు. ఈ పరిశ్రమలను తెరిపించడానికి అవకాశాలు ఉన్నాయని ఆ నివేదికలో మేము తెలిపామని సబ్ కమిటీ సభ్యులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలియజేసారని, అయినా ప్రభుత్వం నివేదిక ను పరిశీలించి వెంటనే తెరిపించేందుకు తగిన కార్యాచరణ చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని భూమయ్య అన్నారు. నిన్న మీరు జిల్లాలో సమస్యల గురించి మాట్లాడిన సందర్భంగా ప్రజా పాలన గురించి మీరు ఎంతో గంభీరంగా మాట్లాడినప్పటికీ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడంలో జిల్లా రైతుల పట్ల మీ నిర్లక్ష్యం తెలియజేస్తుందని అన్నారు. ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సైతం ఎన్ఎస్ఎఫ్ గురించి మర్చిపోయి ఆయిల్ ఫామ్ గురించి మాట్లాడుతున్నారని, ఆయిల్ ఫామ్ గురించి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు కానీ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడంలో మీ హామీలు అమల్లో నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తుందని పేర్కొన్నారు. దీనితోపాటు ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించి దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని భూమయ్య డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులు అంతా చెరుకును పండించే అలవాటు ఉందని, చెరుకు పంట సైతం ఆరుతడి పంట అయినందున చెరుకు పంట పండించే అపారమైన అనుభవం ఉన్న రైతులు ఉన్నారని వారు అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో గల రెండు చెక్కర ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బి సాయిలు, ఆర్ గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
