. . . 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటో లు, 2 కార్లు, ఒక తల్వార్ స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ ,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్ద శనివారం ఉదయం కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5.00 గంటల నుంచి 8.30 గంటల వరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తో కలిసి స్థానికంగా ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ. . . పోలీసు-ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణకు ప్రజలను భాగస్వాములను చేయడం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కమ్యూనిటి కాంట్రాక్ట్ భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు గుర్తించారు. వీటిలో 11 వాహనాల నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్నట్లు గుర్తించారు. అలాగే 18 బీరు బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు ,ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల పై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లతో, ఇతర మారణాయుధాలతో ఫోటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పిల్లలలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సూచించారు. గంజాయి వ్యసనానికి గురైన వారి గురించి సమాచారం అందిస్తే వారికి డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని చెప్పారు.సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాల కు గురైతే వెంటనే 1930 కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.ప్రజల సమాచారమే నేరాల ఛేదనకు బలమైన ఆయుధమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఛేదించిన పలు తీవ్రమైన దొంగతనం కేసులో ప్రజలు అందించిన సమాచారం కీలకపాత్ర పోషించిందన్నారు. ఒక కేసులో పంచర్ షాప్ కార్మికులు ఇచ్చిన సమాచారం, మరో కేసులో విలేకరి అందించిన సమాచారం ఆధారంగా నిందితులను అరెస్టు చేయడం సాధ్యమైందని తెలిపారు.కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో అనుమానితుల తో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, జీవనశైలిని తెలుసుకున్నారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిస్తే చట్టపరమైన నిబంధనల మేరకు షీట్ల తొలగింపును పరిశీలిస్తామని తెలిపారు. అలాగే కరాటేలో ప్రతిభ కనబరిచిన యువతను అభినందించి, క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, బిక్కనూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఆర్‌ఐలు సంతోష్, నవీన్, కృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
