- నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం
- నిరుద్యోగుల నిలువు దోపిడీ
- అమాయకులకు టోపీ పెట్టిన కస్పా శ్యామ్
- ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అండతోనే దుబాయ్ స్కామ్..?
- మోసగాడు శ్యామ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు
- ఉద్యోగాల పేరుతో ఆశావహులకు గాలం
- కోట్లు కొట్టేసిన శ్యామ్ మాయాజాలం
- 35మందికి టోకరా, రూ. 3.5కోట్ల వసూళ్లు
- లబోదిబోమంటున్న బాధితులు
- నిలదీసిన బాధితులను నిర్బంధించి హింసిస్తున్న శ్యామ్ ముఠా
ఆర్మూర్, బతుకమ్మ: దుబాయ్ లో ఉద్యోగాలిపిస్తామని, లక్షల్లో వేతనాలు వస్తాయని నమ్మబలికి అమాయక నిరుద్యోగులను నిలువునా ముంచిన ఉదంతం వెలుగు చూసింది. అమలాపురం నుంచి ఆర్మూర్ నియోజకవర్గం వరకూ విస్తరించిన ఈ దుబాయ్ జాబ్ స్కామ్ ప్రధాన పాత్రధారి నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన కస్పా శ్యామ్ అని బాధితులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కలకం సృష్టించిన ఈ ఘరానా మోసంతో నిరుద్యోగుల నిలువు దోపిడీ చేసి అమాయకులకు టోపీ పెట్టిన కస్పా శ్యామ్ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం.

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అండతోనే శ్యామ్ ఈ దుబాయ్ ఉద్యోగాల స్కామ్ కు పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో ఆశావహులకు గాలం వేసి కోట్ల రూపాయలు కొట్టేసిన శ్యామ్ మాయాజాలం చూసి నందిపేట్ మండల వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35మంది నిరుద్యోగులను మోసగించి వారి నుంచి మూడున్నర కోట్ల రూపాయలను వసూలు చేసిన బ్రోకర్ శ్యామ్ ఉద్యోగాలిప్పించకుండా నిలువునా ముంచాడు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి పేద కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చిన శ్యామ్ మోసాన్ని తలచుకుని బాధిత కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. ఇదేం అన్యాయమని నిలదీసి తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితులను శ్యామ్ ముఠా నిర్బంధించి హింసిన్నారు. మంచి ఉద్యోగం వస్తుందని, లక్షల్లో జీతం జేబులో పడుతుందని ఏజెంట్ శ్యామ్ చెప్పిన మాయ మాటలు నమ్మిన నిరుద్యోగులు కష్టాల్లో కూరుకుపోయారు.

శ్యామ్ మాయాజాలంలో చిక్కుకున్న దాదాపు 35 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అతడికి మూడున్నర కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. నకిలీ పాస్ పోర్ట్, విజిటింగ్ వీసాలతో వారిని దుబాయ్ చేర్చిన శ్యామ్ ముఠా దాదాపు మూడు నెలల పాటు వారిని గదికే పరిమితం చేసింది. తమ ఉద్యోగాలేమయ్యాయని నిలదీస్తే రేపుమాపు అంటూ కాలం గడిపి చివరకు వారిని వదిలేశారు. దీంతో మోసపోయామని గుర్తించిన నిరుద్యోగులు దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడ్డారు. వీసా గడువు కూడా ముగియడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన బాధితులు ఎలాగో అలా దుబాయ్ నుంచి బయటపడ్డారు. కాగా రూ. 15లక్షలు ఇచ్చి మోసపోయిన అమలాపురం కు చెందిన ఒక బాధితుడు శ్యామ్ ను కలిసేందుకు నిజామాబాద్ జిల్లా చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. చివరకు శ్యామ్ ను కలిసి తన డబ్బులు తనకివ్వాలని కోరగా శ్యామ్ అతడి అనుచరులు బాధితుడిని నిర్బంధించి హింసిన్నారు. ఈ వ్యవహారం పై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని, సూత్రధారులను, పాత్రధారులు పట్టుకోవాలని, శ్యామ్ చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

