. . . 27 వ తేదీ నుండి గ్రామాల బాట కార్యక్రమం
. . . తనకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించనున్న జీవన్ రెడ్డి
. . . పార్టీ మార్పుపై ప్రజాభిప్రాయం సేకరించనున్న జీవన్ రెడ్డి
జగిత్యాల, బతుకమ్మ :
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఖాయమైంది. కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి తనకు గత రెండు పర్యాయాలుగా జరిగిన పరాభావాన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ మారేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ లు జీవన్ రెడ్డితో సమావేశమైన తర్వాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిసింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దైవం నిర్ణయించింది జీవన్ రెడ్డి అమలు చేస్తాడని చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపెడుతుంది. ఈ నెల 25న జీవన్ రెడ్డి పార్టీ మారుతాడని జగిత్యాల జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తనకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు 27 నుంచి గ్రామాల బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది. తాను పార్టీ మారడం పై ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వెలువరిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.
2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన జీవన్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి ఓడిపోవడం, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో కండువా కప్పుకోవడం ఆయనకు చేటుగా మారింది. మొన్నటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి తనకే ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని అనుకున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడ్డుకున్నారని అల్పోర్ప్ అధినేత నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఆయన ఎన్నికల్లో ఓటమి పాలుకావడం సాధారణంగా జరుగలేదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అధికార పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అన్నీ అస్త్రశస్త్రాలు ఉన్నప్పటికీ ఓటమి పాలుకావడం వెనుక అధికార పార్టీలో కోవర్టు రాజకీయాలే కారణమని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

తదనంతరం జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఇచ్చిన అభ్యర్థుల జాబితాను పక్కన పెట్టి సంజయ్ ప్రతిపాదించిన అభ్యర్థులకే బీఫారాలు ఇవ్వడంతో పరిస్థితి చేయి దాటింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా జీవన్ రెడ్డి వర్గం గెలిచిన మున్సిపల్ చైర్మెన్ ఎన్నికల్లో సంజయ్ మాటనే నెగ్గింది. అది ముగిసిన అధ్యాయం అనుకునే లోపే తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు పంపిస్తుందని జీవన్ రెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుంగు మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో జీవన్ రెడ్డి కినుకు వహించాడు. తనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత తగ్గిందని, పార్టీలో ఉండలేమని క్యాడర్ వద్ద చెప్పుకోచ్చాడు. అదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ దూతలుగా పొన్నం ప్రభాకర్, అది శ్రీనివాస్ లను జీవన్ రెడ్డి వద్దకు పంపి పార్టీ మార్పు విషయాన్ని పునరాలోచన చేయాలని సూచించినా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా తన కార్యాలయం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్న ఫ్లెక్సీలను జీవన్ రెడ్డి తొలగింపజేశారు. అంతకుముందు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా జీవన్ రెడ్డికి ఫోన్ చేసి బీజేపీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో బీజేపీ అగ్రనాయకత్వం ద్వారా మాట్లాడించి పార్టీలో చేరాలని కోరారు. అయితే రంజాన్ పండుగ నాడు మాత్రం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తో కలిసి వేడుకల్లో పాలుపంచుకోవడం కలకలం రేపింది. జీవన్ రెడ్డి చూపు బీఆర్ఎస్ వైపే అని సంకేతాలు వెలువడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీ వీడిన తర్వాత బీఆర్ఎస్ కు జగిత్యాల జిల్లాలో నాయకత్వ లేమి ఏర్పడింది. సెక్యులర్ లీడర్ గా ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్లు అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25 తర్వాత జరిగే పరిణామాలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

