. . . అరెస్ట్ అయిన ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులను జైల్లో పెట్టటం దురదృష్టకరమని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకుంటోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారులు శనివారం చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు. చలో సెక్రటేరియట్ కు వెళ్తోన్న తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీసులు నిర్బంధించారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్టైన ఉద్యమకారులను కవిత పరామర్శించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వాగ్దానాలు అమలు చేయకుంటే కాంగ్రెస్ బయట తిరిగే పరిస్థితి ఉండదని, ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి, పెన్షన్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి భూమి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్నదే ఉద్యమకారులని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని పాలించినా, వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పెన్షన్, భూమి ఇస్తామని చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న సరే కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై మనం ఒత్తిడి చేస్తే ఉద్యమకారుల బిల్లు పెడతామని హామీ ఇచ్చారని, కానీ అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తకుండా మోసం చేశారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమకారులు సెక్రటేరియేట్ ముట్టదించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుంటే మీరు బయట తిరిగే పరిస్థితే ఉండదని తెలిపారు. ఉద్యమకారులంతా ధైర్యంగా ఉండాలని, మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, హక్కులు సాధించుకోవటం పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యమకారుల తరఫున భూపోరాటాలను జాగృతి ప్రారంభించిందని, మున్ముందు కూడా ఉద్యమకారులతో కలిసి పనిచేస్తుందన్నారు. ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడే ఉంటానని తేల్చి చెప్పడంతో పోలీసులు ఉద్యమకారులను విడుదల చేశారు. అనంతరం ఉద్యమకారులను వెంట తీసుకొని ఠాణా నుంచి కవిత బయటకు వచ్చింది.
