27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తుంది

 

. . . ఫీజు రియంబర్స్మెంట్ అమలు కోసం జూలై 15న చలో హైదరాబాద్ 

 

. . . బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బీసీలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతూనే ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ బీసీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా తయారయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నిజామాబాద్ లోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ లో బిసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాసోజు శ్రీకాంతచారి నుండి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు, కొండ లక్ష్మణ్ బాబూజీ నుండి మొదలుకొని ప్రొఫెసర్ జయశంకర్ వరకు బీసీలే రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమయ్యారని, సకలజనుల సమ్మె, విద్యార్థి జేఏసీ, ధూమ్ దాం లతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉదృతం చేసింది బహుజన వర్గాలేనని, త్యాగాలు బీసీ ఎస్సీ ఎస్టీలు చేస్తే ఈరోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రం ని పిడికెడు శాతం లేని అగ్రకులాలు అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం నుండి బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 24 మంది ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత 19 మందికి తగ్గారని, మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముగ్గురుకి తగ్గారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించారని, తెలంగాణ వచ్చిన తర్వాత యువజనలు, అడవులు, పాడి పరిశ్రమ శాఖలు కేటాయించి బీసీలను అవమానించారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాం, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీలు చివరికి దళిత బిసి మంత్రులను అవమానకర రీతిలో బర్తరఫ్ లు చేశారని, అగ్రకుల రెడ్డి వెలమలు సీఎం పీట మీద కూర్చొని, కనీసం డిప్యూటీ సీఎం కూడా బీసీలకు ఇవ్వకుండా తెలంగాణలో బీసీలను అణిచి వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజుల రీ ఎంబర్స్ మెంట్ స్కీమును ఎలాంటి నిబంధన లేకుండా అమలు చేశారని, రాష్ట్రం వచ్చిన తరువాత ఫీజుల రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతుందని, తాను చేయదలచుకున్న పనిని కోర్టుల ద్వారా చేపిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ చేపడుతామని, జూలై 15న వేలాది మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల సత్తాను ప్రభుత్వానికి చూపిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఫీజుల రీ ఎంబర్స్ మెంట్ నిన్న రాష్ట్ర హైకోర్టు ఫీజులు విద్యార్థుల వద్ద కళాశాలలు వసూలు చేసుకోవచ్చని మద్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, విద్యార్థులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేయాలని గత రెండు సంవత్సరాలుగా కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే 7000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకుండా నాన్చవేత దొరణి అవలంబిస్తుందని, ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనివార్యంగా కాలేజీ యజమాన్యాలు కోర్టుల్లో కేసులు వేశారని, కోర్టుల్లో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాల్సి ఉన్న, “రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చిన మందు అదే” అన్నట్టు ప్రభుత్వం చేయాలనుకున్న రద్దును కోర్టు తీర్పుల ద్వారా పరోక్షంగా చేపిస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తల తోక లేకుండా, విద్యార్థి వ్యతిరేక భావంతో జీవో నెంబర్ 7, 8, 9 లను తీసుకువచ్చి రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల ను తీవ్ర గందరగోళానికి గురి చేసిందన్నారు, ఫీజుల బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా, ఒకవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుండి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పులు వస్తుంటే ప్రభుత్వం దున్నపోతు చందంగా వ్యవహరిస్తుందని, బడుగు విద్యార్థుల వ్యతిరేకులకు జీపీలుగా, అడ్వకేట్ జనరల్ గా అవకాశం ఇవ్వడంతో లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమై రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజుల రీ ఎంబర్స్ మెంట్ విషయంలో దిగి రాకపోతే జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలో బందు చేపట్టి 15వ తేదీన వేలాదిమంది విద్యార్థులతో సుందరయ్య పార్క్ నుండి ఇందిరాపార్క్ వరకు విద్యార్థి మార్చ్ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అద్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అద్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్.. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవీందర్, కొయ్యడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సత్యప్రకాష్, చంద్రమోహన్, అపర్ణ, రేఖ, గంగాధర్, శ్రీనివాస్, జయ, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.

 

It is only after the formation of Telangana that BCs are facing greater injustice.

More articles

Latest article