ప్రభుత్వం ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోదు
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్
బతుకమ్మ,మోర్తాడ్: ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఇలా ప్రవర్తించడం సరికాదని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజా నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బుధవారం జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడని విమర్శించారు. పోలీసుల మీదనే భౌతిక దాడులకు పురిగొల్పాడని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే ప్రశాంత్ రెడ్డి రోడ్లమీద కూడా తిరగలేడన్నారు. ప్రశాంత్ రెడ్డి పది సంవత్సరాలుగా తన చుట్టూ రౌడీ రాజ్యాన్ని నిర్మించుకున్నారన్నారు. ఆ రౌడీలతో గతంలో ప్రజల మీద దాడులు చేయించేవాడన్నారు. ఇప్పుడు ఏకంగా పోలీసుల మీదనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజల మీద పడి దోచుకుతున్న చరిత్ర ప్రశాంత్ రెడ్డిది అని వ్యాఖ్యనించారు. పోలీసులపై భౌతిక దాడికి పాల్పడడంతోనే లా అండ్ ఆర్డర్ ను కాపాడడం దృష్ట్యా లాఠీఛార్జి చేశారని తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరి వీడియోలు ఉన్నాయని, చట్టం నుంచి వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, ప్రజా ప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
