హైదరాబాద్, బతుకమ్మ: ఉద్యమ ప్రతీకలను అవమానించడం తగదని, ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చి అందరి మనస్సులను నొప్పించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పాలు, పంచా మృతంతో అభిషేకం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ యువత, ఉద్యమకారులు కలిసి పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని, ఉద్యమకారుల జోలికి వచ్చిన, అవమానించిన వారెవరూ బాగుపడలేదన్నారు. ఆ విషయం మీ గురువు చంద్రబాబుకు బాగా తెలుసని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు పెట్టిన విగ్రహంలో ఉన్న జొన్న, మక్క కంకులను తెలంగాణకు ప్రతీక అని చెబుతున్నారని, ఆ పంటలు ఇతర రాష్ర్టాల్లో సాగు చేయడం లేదా? ఆ విగ్రహంలో ప్రత్యేకత ఏమి ఉందని ప్రశ్నించారు. ప్రపంచంలో అందరూ పూలతో పూజిస్తే.. పూలను బతుకమ్మగా పూజించే సంస్కృతి తెలంగాణది అని అన్నారు. ఆడ బిడ్డలు పూజించే బతుకమ్మను తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి మాయం చేసి, కాంగ్రెస్ గుర్తు అయిన హస్తంను పెట్టారని విమర్శించారు. విగ్రహాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెడతామని సీఎం బెదిరిస్తున్నారని, ఉద్యమకారులపై గన్ను గురిపెట్టిననాడే రేవంత్ కు ఎవరూ భయపడలేదని, ఇప్పుడు ఆయన బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

