- పార్టీ నుంచి బహిష్కరిస్తు ప్రకటన
- ఎమ్మెల్సీ కవిత వెంట నడిచేది ఎవరు?
- కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా?
హైద్రాబాద్, బతుకమ్మ : భారత రాష్ట్రసమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తు ఆ పార్టీ అధినేత, మాజీ సీయం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి.రవింధర్ రావుల పేరు మీద మంగళవారం ఎమ్మెల్సీ కవితను సస్పెన్షన్ ప్రకటన వెలువడింది. ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కే.చంద్రశేఖర్ రావు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటు వెలువడిన ప్రకటన రాజకీయ వర్గాలలో ప్రకంపనలు రేపింది. ప్రధానంగా తెలంగాణ రాజకీయాలలో మాత్రం కొత్త చర్చకు దారి తీసింది. స్వయంగా కేసీఆర్ తన కూతురు కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తు చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం అమెరికా నుంచి తిరిగి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడంపై విలేఖరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవినీతి జరిగిందని దానికి అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, మెఘా కాంట్రాక్టర్ కారణమని చేసిన వాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగలేదని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే, ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు ప్రధాన పక్షాలకు ఆయుధంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడి అరెస్టు చేసిన తరువాత జైలునుంచి విడుదలైనప్పటి నుంచి ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలీ పార్టీని అప్రతిష్టకు గురిచేస్తుంది. అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత తాను తండ్రికి రాసిన లేఖ మీడియాకు లీక్ అయినప్పటి నుంచి బహిరంగంగా చేస్తున్న కామెంట్ లు పార్టీని ఇరకాటంలో పడేశాయి. ప్రధానంగా తాను తండ్రికి రాసిన వ్యక్తిగత లేఖను లీక్ చేయడంలో కేసీఆర్ చూట్టు ఉన్న దయ్యాల పనే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కవిత అమెరికా పర్యటనకు ముందు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అసెంబ్లీ అమోదం పొందిన వెంటనే పార్టీ నేతలు స్పందించలేదని కవిత పైర్ అయ్యారు. సీయం కేసీఆర్ కు డబ్బు యావలేదని కాని హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కాంట్రాక్టర్ ల కారణంగానే అవినీతి అంటు చేసిన వాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని కుదిపేశాయి. చివరకు మాజీ సీయం కేసిఆర్ తన కూతురు వైఖరిపై కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పలేదు.
కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో పైర్ బ్రాండ్ గా ముద్రవేశాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జాగృతి ద్వార ఉద్యమకారిణిగా, బతుకమ్మ విశిష్టతను పల్లెల నుంచి విశ్వ వ్యాప్తం చేయడంలో సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో తురుపు ముక్కగా నిలిచారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంపీగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు, బ్రాడ్ గేజ్ లైన్, రైల్వే ఓవర్ బ్రిడ్జీల కోసం కస్టపడ్డారు. 2019 లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా కవిత ఓటమి పాలయ్యారు. అప్పటికి రెండోదఫా కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేయగా తరువాత వచ్చిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో గెలిచి శాసనమండలికి ఎంపికయ్యారు. దాని పదవి కాలం ముగిసిన తరువాత రెండోసారి అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండోసారి ప్రభుత్వంలోను మంత్రి పదవిపై అశలు పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. తీరా 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు చకచక జరిగిపోయాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు తరువాత తన తండ్రికి తనకు మధ్య గ్యాప్ పెరుగడానికి పార్టీలోని తన కుటుంబ సభ్యులే కారణం అని కవిత గుర్రుగా ఉన్నారు. జైలు నుంచి విడుదల తరువాత కవిత పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ని విస్తరించి కార్యక్రమాలు చేపట్టారు. అది కుడా బీఆర్ఎస్ నాయకత్వంలో కంటగింపుగా మారింది.
బీఆర్ఎస్ పార్టీలో పైర్ బ్రాండ్, మాజీ సీయం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత అమె వెంట ఉండేది ఎవరు అనే చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో కవిత అమెరికా వెల్లినప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుంచి కవితను తప్పించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు. అంతకుముందు పార్టీకి చెందిన నాయకులపై కవిత ఘాటు వాఖ్యలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరు స్పందించవద్ధని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కవిత ఎంపీగా ఓటమికి నిజామాబాద్ పార్లమెంట్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీలు కారణమని కవిత పలు మార్లు తన అనుచరుల వద్ధ పార్టీ అదినేత వద్ద చెప్పుకుని బాధపడిన తరువాత వారిమధ్య సంబంధాలు అంతంత మాత్రమే. ఇదిలా ఉండగా మంగళవారం ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత నాయకులు స్పందించడం కొసమెరుపు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజిబుద్ధిన్ లు కవిత సస్పెన్షన్ ను స్వాగతించి తాము పార్టీ అధినేత కేసీఆర్ వెంట ఉంటామని వాఖ్యానించడం విశేషం. బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ అవడంతో ఎమ్మెల్సీ కవిత ఒంటరి అనే చర్చ జరుగుతుంది. పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన గంటల వ్యవధిలోనే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల లో ఉన్న కవిత ఫొటోలను తొలిగించడం గమనార్హం. పార్టీ అధినేత ఆదేశాల మేరకు కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు కవితను వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని ఆదేశాలు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నుంచి కవితను బహిష్కరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా తాను ఆ పదవిలో ఉంటారా లేక రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతుంది. బుధవారం హైద్రాబాద్ లో తన సస్పెన్షన్ తో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై ప్రకటన చేస్తారని తెలిసింది.
