- చిన్నారులను గాయపరుస్తున్న శునకాలు
- రోడ్ల మీద ప్రయాణించాలంటే భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
రుద్రూర్, బతుకమ్మ : జిల్లాలో వీధి కుక్కల బెడద అధికమైంది. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో శూనకాలు స్వైర విహారం చేస్తున్నాయి. రుద్రూర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం వద్ద శూనకాలు గుంపులు గుంపులుగా ఉండడం వలన ఆలయానికి వచ్చే భక్తులు జంకుతున్నారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో కుక్కల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు రోడ్ల వెంట ప్రయాణించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. మండలాల పరిధిలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. ఆరు బయటకు ఆడుకోవడానికి వచ్చిన చిన్నారులను, దుకాణాలకు తినుబండరాల కోసం వెళ్తున్న వారిని వెంటాడి గాయపరుస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో కుక్కల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.