- ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీరియస్
- ఏడి స్థాయి అధికారితో విచారణ?
- ఎవరిపై వేటు పడేనో?
నిజామాబాద్, బతుకమ్మ : డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నియమితులై 20 రోజులు విధులు నిర్వహించిన తర్వాత తమ తప్పు జరిగిందని సంబంధిత టీచర్ ను తొలగించి కొత్త వారిని భర్తీ చేయడం కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని తొలగించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా విద్యాశాఖాధికారి వైస్ చైర్మన్ గా ఉండే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వెరిఫికేషన్ లో తప్పిదాలు కొందరి జీవితాలు తారుమారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గత నెల 9న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న తర్వాత నియామకం చెల్లదని బై మిస్టెక్ అంటూ విద్యాశాఖ ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించడం ఇతరులకు పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈ విషయంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో డీఎస్సీ రిక్రూట్ అయిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కౌన్సిల్ ప్రక్రియ కోసం జరిగిన ఎంపికపై ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు పోస్టింగ్ లలోనూ ఉపాధ్యాయులను ఇన్వాల్ చేయడంపై విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్వయంగా కమిటీ పర్యవేక్షించాల్సిన చోట డీఈవోతో పాటు డిఈవో కార్యాలయంకు సంబంధించిన ఏడి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ వెరిఫికేషన్ జరుగాలి. కానీ అందులో అధికారులు తప్పుకుని ఉపాధ్యాయులపై భారం వేసి వదిలేశారు. గత నెల 9కు ముందు అర్ధరాత్రి వరకు జరిగిన వెరిఫికేషన్ అంతా సక్రమంగా ఉందని డైరెక్టర్ ద్వారా అనుమతులు తీసుకుని పోస్టింగ్ ఇచ్చిన విద్యాశాఖ పుట్ట లావణ్య అనే ఉపాధ్యాయురాలికి ధర్పల్లిలోని ఒడ్డెరకాలనీలో టీచర్ పోస్టు ఇవ్వగా 20 రోజులు విధులు నిర్వహించిన తర్వాత మిస్టెక్ జరిగిందని, తప్పించి భార్గవి అనే టీచర్ కు పోస్టింగ్ ఇచ్చారు. భార్గవి అనే టీచర్ అసలు కౌన్సిలింగ్ కు హాజరుకాలేదని, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కాలేదన్న ఆరోపణలు వచ్చాయి. నవనీత అనే ఉపాధ్యాయురాలి విషయంలోనూ మిస్టెక్ అనే పదాన్ని వాడి తప్పించుకున్నారు. మొత్తమ్మీద గత వారం రోజులుగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిల్ పై ఆరోపణలు వస్తున్నాయి.
ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన, కౌన్సిలింగ్ వ్యవహరంపై ఆరోపణలు రావడంతో దిద్దుబాటుకు జిల్లా కలెక్టర్ ఉపక్రమించినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకనుగుణంగా ఒక ఏడీ స్థాయి అధికారిచేత విచారణ జరుపాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో తప్పిదాలు జరిగితే విద్యాశాఖ కార్యాలయ సిబ్బందిపై లేదా వెరిఫికేషన్ లో పాల్గొన్న ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయన్న చర్చ జరుగుతుంది. అంతేగాకుండా గతంలో పని చేసిన డీఈవోపై విచారణ జరుపుతారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద డీఎస్సీ -2024 వ్యవహరం విద్యాశాఖకు మచ్చ తేవడమే కాకుండా వేటు పడడం ఖాయమన్న చర్చ ప్రారంభమైంది.

