. . . మూడు స్మార్ట్ ఫోన్లు, బైక్ స్వాధీనం
బిచ్కుంద, బతుకమ్మ :
బిచ్కుంద మండల కేంద్రంలో సెల్ ఫోన్లను అపహరించిన ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ ఈ నెల 15న బిచ్కుంద గ్రామానికి చెందిన వ్యాపారి షేక్ షాదుల్ తన రాయల్ వెల్డింగ్ షాప్ కు తాళం వేసి వెళ్లగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి షాపులో ఉన్న సుమారు రూ.10 వేల విలువైన మొబైల్ ఫోన్ ను అపహరించారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా బిచ్కుంద ఎస్‌ఐ జి. రాజు, సిబ్బందితో కలిసి అయ్యప్ప టెంపుల్ ప్రాంతంలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక మోటార్‌సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా వారు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాకు చెందిన కుంచపు గౌరి ఆలియాస్ రవి, ఒడిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్ జిల్లాకు చెందిన మురళీ ప్రధాన్ లు తామే చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. కుంచపు గౌరిపై శాబాజ్, చౌదరి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. మురళి ప్రధాన్ పై మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ లో కేసులున్నట్లు తెలిసిందన్నారు.ప్రజలు తమ గ్రామాలు, కాలనీలలో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇళ్లు, దుకాణాలకు బలమైన తాళాలు వేసుకోవడంతో పాటు, వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గమనించినా అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని బిచ్కుంద పోలీసులు ప్రజలను కోరారు.
