27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దిశా సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష

 

. . . ఎంపీ సురేష్ షెట్కర్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీ సురేష్ షెట్కర్ చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా దిశా కమిటీ చైర్మన్ సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వ్యవసాయం, నీటిపారుదల, రహదారులు, రహదారి భద్రత, బ్యాంకింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి, కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, ఇతర ఆర్థిక సహాయ పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఆరుతడి పంటలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఉపాధి లభించేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తనవంతుగా సహకారం అందించి అభివృద్ధి పనులను వేగవతానికి కృషి చేస్తానని, ప్రజలకు కావలసిన మౌలిక వసతులను సంబంధిత శాఖ అధికారులు కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు చేసిన సూచనలను సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని, శాఖల మధ్య సమన్వయం పెంపొందించి అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్, యన్ వై గిరి, డి ఆర్ డి ఏ దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Officials must work in coordination and strive for the district's development.

More articles

Latest article