పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం
బతుకమ్మ: బిచ్కుంద : మొరం అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మొరం మాఫియా రోజురోజుకూ కొత్తరూపం దాల్చుతోంది. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మొరం అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ మండలకేంద్రాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను తవ్వి బొందల గడ్డగా మార్చుతున్నారు. మొరం తవ్వకాల పేరుతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమార్కులు ఆ శాఖకు ఇంత ఈ శాఖకు అంతా అని అప్పజెప్పి యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. భూముల చదును పేరిట నయా మొరం అక్రమ దందాకు తెరలేపారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. కాగా సోమవారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న మొరం టిప్పర్ ను పోలీసులు పట్టుకొని కాసేపటికి అనుమతి ఉందని వదిలేశారు. కాగా స్థానికంగా ఉన్న కొందరు తహశీల్దార్ ను అడుగగా ఎలాంటి అనుమతులు లేవని తెలిపినట్లు సమాచారం. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గ్రామ యువకులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ మొరం దందాకు అడ్డుకట్టవేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.