ఎల్లయ్య చెరువులో జోరుగా మట్టి అక్రమ రవాణా…

0 12,231

 

. . . ఇటుక బట్టీలు, ఇండ్ల నిర్మాణాలకు, వెంచర్లకు మట్టి తరలింపు

 

. . . రైతుల కోసం ఉచితంగా ఇవ్వాల్సిన మట్టి వ్యాపారానికి మళ్లింపు

 

. . . చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు నుంచి అక్రమంగా మట్టిని తవ్వుతూ కొందరు అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.  రైతుల వ్యవసాయ అవసరాల కోసం ఉచితంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం అనుమతించిన చెరువు మట్టిని, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు అవసరాలకు ఇటుక బట్టీలకు, వెంచర్లకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

Illegal soil trafficking rampant in Yellaiya Lake...

 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చెరువు మట్టిని కేవలం వ్యవసాయ భూముల సారాన్ని పెంచేందుకు మాత్రమే ఉపయోగించాలి. ఇందుకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లేదా ఇరిగేషన్ ద్వారా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అయితే బాన్సువాడలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.వాణిజ్య అవసరాలకు మట్టిని తరలించాలంటే నీటిపారుదల, రెవెన్యూ, స్థానిక సంస్థల అనుమతులు అవసరం కాగా, అవి లేకుండానే భారీగా మట్టి రవాణా జరుగుతుంది.చెరువులో జేసీబీలతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలించి వ్యాపారం చేస్తే మట్టి మాఫియా మీద కేసులు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని, జరుగుతున్న అక్రమాలు బయటపడకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెరువు మట్టి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో జరుగుతున్న అక్రమ మట్టి తరలింపుపై ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారా?.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

 

Illegal soil trafficking rampant in Yellaiya Lake...

 

. . . కలెక్టర్ కు ఏడుగురు కౌన్సిలర్ ల లేఖ

బాన్సువాడ పురపాలక సంఘంలోని బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు ఏడుగురు చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై శనివారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మొదట ఆర్డీఓకు, ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కలెక్టర్ ను ఆశ్రయించారు. వారు మాట్లాడుతూ రోజూ సుమారు 100 ట్రాక్టర్ లు, 30 నుంచి 40 టిప్పర్ లు, 6 జేసీబీలతో చెరువు మట్టిని తరలిస్తున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చెరువులో చెపలు పట్టే అవకాశం ఉండదని వాపోయారు. మట్టి రైతులకు కాకుండా ఇటుక బట్టీలకు ప్లాట్ల వారికి అమ్ముతున్నారని, ఒక్కో టిప్పర్ రూ.2500, ట్రాక్టర్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఆర్డీఓ ప్రత్యేకంగా కొందరు కాంట్రాక్టర్ లను పిలిచి రైతుల పొలాలకు మాత్రమే వెళ్లేలా రేటు ఫిక్స్ చేయాలని కోరినట్టు లేఖలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే తవ్వకాలకు అనుమతి ఉందని ఆర్డీఓ చెప్పినా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్డీఓ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని కౌన్సిలర్ లు నస్రీన్, అంజూమ్, ఆమనీ, మానస, అంజిగౌడ్, మఖబుల్ లేఖలో పేర్కొన్నారు.

 

Illegal soil trafficking rampant in Yellaiya Lake...

Leave A Reply

Your email address will not be published.