28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భారీ వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టిటిడి తరహాలో యాదగిరి గుట్టని అభివృద్ధి చేయాలి

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

యాదగిరిగుట్టలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ అభివృద్ధిలో భాగంగా మొత్తం ₹99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ₹43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల విధానంలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్య అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించేందుకు ప్రత్యేక శాలలు, అలాగే గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు.

 

CM performs Bhoomi Puja for huge Vedic school complex

 

వేద పాఠశాలకు భూమిపూజతో పాటు ₹43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం ₹9.87 కోట్లతో భారీ కల్యాణ మండప నిర్మాణానికి, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ₹1.41 కోట్ల వ్యయంతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణానికి, అలాగే రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా ₹1.35 కోట్లతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

CM performs Bhoomi Puja for huge Vedic school complex

More articles

Latest article