. . . మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం
. . . ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
. . . లక్షల్లో చేతులు మారుతున్న వైనం
పిట్లం, బతుకమ్మ :
పిట్లం మండల కేంద్రంలో అక్రమంగా జీరో చిట్టీల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు చేయించుకోకుండా కొందరు వ్యాపారులు కోట్లలో చిట్టీల దందా నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని చిట్టీల దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు.
50 లక్షల వరకు చిట్టీలు. . .
గ్రామాల్లో చిన్నపాటి చిట్టీల నుంచి మొదలుపెట్టి, మండల కేంద్రంలో ఏకంగా రూ. 50 లక్షల విలువైన పెద్ద చిట్టీల వరకు బాహాటంగానే నిర్వహిస్తున్నారు. ఈ చిట్టీల నిర్వాహకులు అంత చిట్టి నిర్వహిస్తే అంత కమిషన్ తీసుకొంటూ చిట్టీలను నిర్వహిస్తున్నారు. నిర్వహించే చిట్టీలకు ఎటువంటి పూచీకత్తు లేకపోవడంతో భవిష్యత్తులో ఈ చిట్టీల వ్యాపారులు బోర్డు తిప్పేస్తే తమ పరిస్థితి ఏమిటని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం చిట్టీల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరైనా, ఇక్కడ మాత్రం అంతా ‘అన్ అఫీషియల్ గా సాగిపోతోంది.
తనిఖీలు నామమాత్రమే. . .
గతంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం జీరో చిట్టీలు నిర్వహిస్తున్నవారిపై తనిఖీలు చేసిన చర్యలు లేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు అనేకంగా వినిపిస్తున్నాయి. పోలీసులు కొన్ని చోట్ల తనిఖీలు చేపట్టినప్పటికీ, అవి కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయనే ఆరోపణలు సైతం మండలంలో వినిపిస్తున్నాయి. తనిఖీలకు వెళ్లిన అధికారులు చిట్టీ నిర్వాహకుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని, కేసు నమోదు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారని అప్పట్లో అనేకంగా మండలంలో చర్చలు వినిపించాయి.
చర్యలు తీసుకునేది ఎన్నడు ???
అక్రమ మార్గంలో సంపాదనే ధ్యేయంగా సాగుతున్న ఈ దందాపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ చిట్టీల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలు మోసపోకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
