. . . సంగారెడ్డి జైల్లో క్రిషాంక్ ను పరామర్శించిన కేటిఆర్
సంగారెడ్డి, బతుకమ్మ:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కే తారాక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో సంగారెడ్డి జైలులో ఉన్న మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మన్నె క్రిషాంక్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామార్శించారు. ఈ సంధర్బంగా కేటిఆర్ మాట్లాడుతూ…. మన్నె క్రిషాంక్ ఒక చదువుకున్న యువకుడు, న్యాయవాది, పీహెచ్‌డీ పట్టా పొందిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఎస్ఎండీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు అని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజల ముందుకు తీసుకువస్తున్నందుకు క్రిషాంక్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో, 12 రోజులు జైల్లో పెట్టి ‘హ్యాబిచ్యువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గం” అని అన్నారు. క్రిషాంక్‌పై సుమారు 35 కేసులు నమోదు చేయబడ్డాయని వాటిలో ముఖ్యంగా.. మిస్ ఇంగ్లాండ్‌పై జరిగిన వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో ప్రస్తావించినందుకు ఒక కేసు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బినామీ కంపెనీల వ్యవహారాలను బయటపెట్టినందుకు మరో కేసు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతి ని వెలుగులోకి తెచ్చినందుకు కేసులు, గ్రామీణ స్థాయిలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించినందుకు కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలోనే బిజీగా ఉందని కేటిఆర్ విమర్శించారు. “కరీంనగర్‌లో పగటిపూట కాల్పులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఎవరు ట్వీట్ చేశారు అన్నదానిపై మాత్రం అప్రమత్తంగా ఉంది” అని అన్నారు.పోలీసు వ్యవస్థను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ, “పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా పని చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్, జర్నలిస్టులకు వేధింపులు వంటి చర్యలు కొనసాగుతున్నాయి” అని కేటీఆర్ అన్నారు. అదేవిధంగా, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, “ఎవరూ భయపడొద్దు. పార్టీ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది. న్యాయం, ధర్మం మన వైపు ఉన్నాయి” అని తెలిపారు. సంగారెడ్డి జైల్లో ఈ సందర్భంగా కేటిఆర్ తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డా. కల్వకుంట్ల సంజయ్, కేపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
