28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్టంపై బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమని,  రాష్ర్టానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏ ఒక్కరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కవిత మీడియాతో మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయనేది కేసీఆర్ ఆలోచన అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకముందే 2013లో ఉక్కు పరిశ్రమ కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సాకులు చెబుతోందని, ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ గఢ్ నుంచి తీసుకువచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడిన విషయాన్నికవిత గుర్తు చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసిన ప్రస్తుత రాష్ర్ట మంతి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించాలని కవిత డిమాండ్ చేశారు.

More articles

Latest article