సదాశివనగర్, బతుకమ్మ : భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సదాశివనగర్ గ్రామానికి చెందిన చిందం రవి కుటుంబ కలహాల కారణంగా ఈనెల 22న రాత్రి తన భార్య లక్ష్మి (40)పై బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్ 23న ఉదయం ఇంటికి వచ్చి సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో గొడవ జరగడంతో కోపానికి గురైన రవి తన భార్య లక్ష్మిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు.
