29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నగల దుకాణానికి నిప్పు.. తృటిలో తప్పిన ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

సదాశివనగర్, బతుకమ్మ : సదాశివనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే నగల దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బంజే చిన్న ప్రభులింగం తన నివాస గృహంలో నగల దుకాణం పెట్టుకోవడానికి షెడ్ ఏర్పాటు చేసి ఫర్నిచర్ పనులు నిర్వహిస్తున్నారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్న సమయంలో లోపలికి వచ్చి కిరోసిన్ పోసి  నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయానికి లోపల పనులు నిర్వహిస్తున్న వ్యక్తులు ఉండడంతో గమనించి మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ మధ్యకాలంలో మార్వాడి గో బ్యాక్ అన్న నినాదంతో మండల కేంద్రంలో కొందరు ప్లకార్డులతో మార్వాడి గో బ్యాక్ అంటూ ప్రదర్శన నిర్వహించడం ఈ సంఘటనకు బలాన్ని చేకూర్చినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కలిసిమెలిసి వ్యాపారాలు నిర్వహించుకుంటున్న సమయంలో ఇలాంటి చిల్లర చేష్టలతో గ్రామాల్లో అశాంతి నెలకొని వ్యాపారాలు, వ్యక్తుల మధ్య వివక్ష, తగాదాలు పెరిగిపోతాయని  గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

నగల దుకాణానికి నిప్పు పెట్టి పారిపోయిన విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. షాపు మార్వాడీలకు చెందినది అని జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. నేర పూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Fire at jewelry store.. narrowly avoided

More articles

Latest article