25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వందల ఎకరాలు కబ్జా

Must read

📰 Generate e-Paper Clip

– పైసలిస్తే ఇందల్వాయి పెద్ద చెరువు భూమికి పట్టాలు

– చెరువు కుంటలా మారుతోందని గ్రామస్తుల ఆందోళన

– పట్టించుకోని రెవెన్యూ ఉన్నతాధికారులు

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పెద్ద చెరువు భూమి వందల ఎకరాలు కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. మండల కేంద్రం చుట్టు పక్కల ఉన్న ఏ గ్రామంలోనూ ఇంత పెద్ద చెరువు లేదు. రామడుగు వరకు నీరందించే చెరువు భూములను అధికారులు ఇష్టారాజ్యంగా పట్టాలు చేసి పంచిపెడుతున్నారు. పైసలిస్తే ఎంత భూమి అయినా కబ్జా చేసుకోవచ్చని ధీమా ఇస్తున్నారు.

ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరరిస్తుండడం గమనార్హం. కబ్జా లో ఉన్నామని చెప్పి పైసలు ముట్టజెప్పగానే పట్టాలు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాల దందా కాసులు కురిపించడంతో గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. వాస్తవానికి శిఖం భూమికి పట్టా ఇవ్వచ్చా అని గ్రామస్తులు మండిపడుతున్నారు.

ఇలాగే కొనసాగితే చివరికి మండలంలోనే అతి పెద్దదైన ఇందల్వాయి పెద్ద చెరువు కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ యంత్రాంగం తేరుకొని ఇందల్వాయి పెద్ద చెరువు శిఖం భూమిని కబ్జాల నుంచి కాపాడారని, సర్వే చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలని అంటున్నారు. అలాగే చెరువు చుట్టూ కందకం తీయించాలని అంటున్నారు.

సర్వే నంబర్ 2018లో 419 ఎకరాల శిఖం భూమి ఉందని తహసీల్దార్ తెలిపారు. సర్వే చేపట్టి హద్దులు నిర్ణయిస్తామన్నారు.

More articles

Latest article