30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫేజ్-1 లోనే 18,401 సీట్లు భర్తీ

 

. . . రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

హైదరాబాద్, బతుకమ్మ : 

 

పేద, అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నాన్-సీఓఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యను సామాజిక మార్పుకు ప్రధాన సాధనంగా భావిస్తూ పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. గురుకుల విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోందన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు అందగా, అందులో ఎంపీసీ గ్రూప్‌కు 21,447, బైపీసీ గ్రూప్‌కు 17,400, ఎంఈసీ, సీఈసీ, హెచ్ ఈసీ గ్రూపులు కలిపి 6,510 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉండగా, మే 15న 117 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరై 86.09 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. ఫేజ్-1 అడ్మిషన్లలోనే మొత్తం 18,401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇంకా 1,339 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఫేజ్-1లో ఎంపికైన విద్యార్థులు అవసరమైన దృవ పత్రాలతో జూన్ 7 లోపు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని మంత్రి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని మంత్రి కోరారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాలు నేడు జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి తెలిపారు. జేఈఈ మెయిన్ 2026లో 337 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో 26 మంది 90 శాతం పైగా పర్సంటైల్ సాధించడం గర్వకారణమన్నారు. గత ఏడాది 525 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధించడం గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ, దళిత, గిరిజన ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని జాతీయ స్థాయిలో నిలబెడుతున్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైక్రో అకడమిక్ ప్లానింగ్, వారానికొకసారి మాక్ టెస్టులు, ప్రత్యేక అకడమిక్ మానిటరింగ్, నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ వల్ల ఫలితాలు గణనీయంగా మెరుగు పడుతున్నాయని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు మానసిక దృఢత్వం, కౌన్సెలింగ్, వెల్‌నెస్ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గురుకులాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు లేకుండా ప్రతి నెల మొదటి వారంలోనే బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని వెల్లడించారు. విద్యతోనే సామాజిక అసమానతలను తొలగించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోందని, పేద కుటుంబాల పిల్లలను దేశ భవిష్యత్ శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ డీ వై.జె.విజయ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్, అసిస్టెంట్ సెక్రటరీ మధు నాయక్, డిప్యూటీ సెక్రటరీ సహజ, సూపరింటెండెంట్ మృణాళిని, డీపీవో శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Huge response to filling seats in Gurukuls

More articles

Latest article