24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఏసీబీ రైడ్ లో నిజామాబాద్ లెక్కెంత..?

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ అర్బన్ ఎస్ఆర్ లో దొరికిన డాక్యుమెంట్లు ఎన్ని..?
  • ఏసీబీ తరలించిన డాక్యుమెంట్లో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్ని
  • ఏసీబీ రైడ్ తో డాక్యుమెంట్ రైటర్ల పరారీ ఎందుకు
  • ఇందూర్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు జరిగాయా..?
  • చర్చనీయాంశంగా మారిన ఏసీబీ రైడ్స్

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖాధికారులు 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు సాగాయి. ఏసీబీ తనిఖీలకు రాగానే డాక్యుమెంట్ రైటర్లు ఫలాయనం చిత్తగించారు. రాష్ట్రంలోని ప్రధాన కార్యాలయాల్లో ముఖ్యంగా గండిపేట్, షేర్ లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ అర్బన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరా ఎస్ఆర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2,51,990 రూపాయల దరఖాస్తు చేసుకోగా 289 రిజిస్ట్రార్డ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని 19 మంది ప్రైవేట్ వ్యక్తులను, 60 మంది డాక్యుమెంట్ రైటర్లను ఇల్లీగల్ గా ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పని చేస్తలేవని గుర్తించారు. రాష్ట్రంలోని 13 మంది సబ్ రిజిస్ట్రార్ ల ఇళ్ళలో ఏసీబీ తనిఖీలు నిర్వహించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు.

రాష్ట్రంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించగా అందులో నిజామాబాద్ అర్బన్ ఒకటి ఉండడం చర్చకు దారీతీసింది. 23 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు  ఉన్నాయి. అందులో నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు అర్బన్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉండగా అక్కడ నిత్యం 70కి తక్కువ కాకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ శాఖకు ఆదాయం ఆర్జించడంలో ఇందూర్ నగర ఎస్ఆర్ కార్యాలయం ఒకటి. అదే విధంగా ఆ కార్యాలయాన్ని నమ్ముకుని వంద మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు జీవిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు (సీనియర్ అసిస్టెంట్లు), దస్తావేజు లేఖరులు కుమ్ముకై డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రసిద్దికెక్కింది. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై సడలింపులు చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరిగింది. అదే సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ప్రధానంగా అసైన్డ్ భూములను, నాలా కన్వెన్షన్ లేని వాటిని, డీటీసీపీ అప్రూవల్ లేని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అపవాదును మూటగట్టుకున్నారు. డిస్ట్రిక్ రిజిస్ట్రార్ కార్యాలయం అనుబంధంగా ఉన్న నిజామాబాద్ అర్బన్ ఎస్ఆర్ కార్యాలయంలో ఇంత అవినీతి జరుగుతున్నా డిస్ట్రిక్ రిజిస్ట్రార్ పట్టించుకోరన్న వాదనలున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగానే డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలకు తాళాలు వేసి పరారీ కావడంపై చర్చ జరుగుతుంది. లైసెన్స్ కలిన దస్తావేజులేఖరులు ఏసీబీ సోదాలతో ఎందుకు దుకాణాలను మూసివేశారన్న చర్చ ప్రారంభమైంది. సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు మిలాఖత్ అయి ప్రతి డాక్యుమెంట్ కు ఒక రేటు నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న వాదనలున్నాయి. ఇటీవల కాలంలో ఎస్ఆర్ కార్యాలయాల్లో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేక సీనియర్ అసిస్టెంట్లతో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వెనుక కాసుల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజామాబాద్ ఎస్ఆర్ కార్యాలయంలో దాడి జరిగిన తర్వాత అక్కడ ఎంత నగదు దొరికింది, ఎన్ని రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు తరలించారనే ప్రశ్నలు తలెత్తాయి. అంతేగాకుండా రాష్ట్రంలో 13 మంది సబ్ రిజిస్ట్రార్ ఇళ్ళపై సోదాలు జరిపి నగదు, నగలు, ఆదాయం మించిన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకోగా నిజామాబాద్ ఎస్ఆర్ ఇంటిపై సోదాలు జరిగాయా లేదా అన్నది అధికారులు నిర్ధారించలేదు. శుక్రవారం ఏసీబీ రైడ్ కారణంగా శనివారం ఎస్ఆర్ కార్యాలయం బోసిపోయింది. శనివారం గిరాకీ ఉండదని చెబుతున్నప్పటికీ ఏసీబీ దాడుల నేపథ్యంలో అంతా గప్ చూప్ అయ్యారన్న చర్చ జరిగింది.

More articles

Latest article