- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు ఏర్పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ, బైనాక్యూలర్ తో అణుక్షణం పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటు రాష్ట్రంలోని ప్రత్యేక బలగాలయిన 2 ఆక్టోపస్ టీమ్ లు, గ్రేహౌండ్స్ టీమ్లు, స్నైపర్ టీమ్స్ లతో పాటు, నిజామాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీలు టీమ్స్, బి.డి టీమ్స్, డాగ్ స్వ్కాడ్స్ లతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కల్వర్టులు రోడ్లు మొదలగు ప్రదేశాలలో చెక్ చేసి ఏరియా డామినేషన్ చేసినట్లు పేర్కొన్నారు. గత వారం రోజుల నుండి అన్ని హోటల్స్, రెస్టారెంటులు, రిసార్ట్స్లను తనిఖీలు నిర్వహించి, ముఖ్యఅతిది పర్యటించే ప్రాతంలోని అన్ని చోట్ల ఇండ్లను తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తు, 10 కి.మీ వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నామని తెలిపారు. అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చుట్టు ప్రక్కల ప్రతీ ఇంట్లో ఎవ్వరిని కొత్తవారిని రానివ్వవద్దని సూచించినట్లు పేర్కొన్నారు. అనుమానస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే డయల్ 100 లేదా మీ స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ నేపధ్యంలో అదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్ ,సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది, టి.ఎస్.ఎస్.పి బెటాలియన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.