27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రాణాలను తోడేస్తున్న వేధింపులు

Must read

📰 Generate e-Paper Clip

  •  జిల్లాలో వరుస ఘటనలు
  •  గోదావరిలో దూకి తండ్రి కూతురి ఆత్మహత్య
  •  అశోక్ సాగర్ లో దూకి యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్, బతుకమ్మ : అప్పులు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. వ్యాపారుల వద్ద, ఫైనాన్షియర్ల వద్ద తీసుకున్న అప్పులతో పాటు తెలిసిన వారి వద్ద తీసుకున్న అప్పులు కూడా ప్రజల ప్రాణాలను బలికోరుతున్నాయి. జిల్లా కేంద్రంలోని న్యాల్ కల్ రోడ్డుకు చెందిన వేణు అతని భార్య అనురాధా, కూతురు పూర్ణిమాలతో కలిసి కుటుంబం బుధవారం ఉదయం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన విషయం వెలుగులోకి వచ్చే సరికి నగరంలోని ఆటోనగర్ కు చెందిన యువకుడు అశోక్ సాగర్ లో శవమై తేలాడు. అప్పులు ఇచ్చిన వారు వేదించడంతో ఆటోనగర్ కు చెందిన హబీబ్ అజర్ అశోక్ సాగర్ లోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకటే రోజు నలుగురు అప్పులు తీసుకున్న కారణంగా ఆత్మహత్యాయత్నం చేయగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
గత నెలలో ఎడపల్లి మండలం బ్రహ్మణపల్లికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఆస్తులు అమ్మిన అప్పులు తీరవని కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. గతంలోనూ చాలా మంది యువకులు అప్పులకు బలయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట్ కు చెందిన తల్లి, కొడుకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం కలకలం రేపింది. అంతకు ముందే క`ష్ణా నదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తిరిగి వడ్డి వ్యాపారి వేదింపులు భరించలేక నిజామాబాద్ కు చెందిన కుటుంబం ఆంధ్రాలో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కుటుంబం మొత్తం అప్పులకు బలై కుటుంబంలో ఒక్కరూ కూడా మిగలకుండాపోయారు.
నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల వేదింపులు తారాస్థాయికి చేరాయి. ఆన్ లైన్ రుణాలు ఇచ్చే యాప్ ల వేదింపులు ఒక విధంగా ఉండగా స్థానికంగా వడ్డీలకు డబ్బులు ఇచ్చే వ్యాపారుల వేదింపులు తారాస్థాయికి పెరిగాయి. తాజాగా వారికి పోలీసు అధికారుల అండదండలు ఉండడంతో వారు రెచ్చిపోతున్నారు. అప్పులు, రికవరి సివిల్ మ్యాటర్ అయినప్పటికీ స్టేషన్ లలో సెటిల్ మెంట్లు చేస్తున్నారు. అప్పులు ఇచ్చే వారికి పోలీసులు తోడు కావడంతో రుణగ్రహితలకు ప్రాణసంకటంగా మారింది. అప్పుల కోసం నానా తంటాలు పడి తీసుకునే వరుకు ఒకత్తయితే వాటి చెల్లింపులో ఆస్తులను, డబ్బులను, చివరకు ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. గతంలో మహిళలపై వేదింపులు జరిగిన ఘటనలున్నాయి. కాల్ మనీగా పిలిచే దందాలో కాలనాగులు కాటేసిన ఘటనలు లేకపోలేదు. అప్పుల పేరిట జరుగుతున్న జీరో ఫైనాన్స్ దందాపై పోలీసు శాఖలో ఉక్కుపాదం మోపడం అటుంచి ఫైనాన్స్ వ్యాపారులతో అంటకాగిన ఘటనలు కూడా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక్క రోజే రెండు ఘటనలు జరుగడంతో పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

More articles

Latest article