. రైతు భరోసా త్వరలోనే ఇస్తాం
. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ సహకారం
. సీఎంతో చర్చించి జిల్లాకు వ్యవసాయ కళాశాల
. రైతు మహోత్సవం ప్రారంభోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల
నిజామాబాద్, బతుకమ్మ: రైతులు ఆదాయం ఉన్న పంటలను సాగు చేయాలని, అన్ని పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శాస్ర్తవేత్తల సూచనలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. డ్రిప్ వ్యవసాయం చేసే రైతులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నా రూ.33వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు.

రూ.లక్ష కోట్ల కాళేశ్వరం నిరుపయోగం
నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్ల తో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూ.1.81 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికీ నీరివ్వలేదని, ఒకటి రెండు నెలల్లో పనులు ప్రారంబించి నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణకు నిదులు మంజూరు చేసి పూర్తి చేస్తామని, అవసరమైన చోట్ల చెక్ డ్యాములు నిర్మిస్తామని మంత్రి అన్నారు.
వడగండ్ల బాధిత రైలుకు కేసీఆర్ పరిహారం ఇవ్వలేదు
గత పదేళ్ళలో కేసీఆర్ వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్ర మంత్రులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. బీఅరెస్ హయాంలో అధికారులు కేసీఆర్ భజన చేశారని, వారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అధికారుల దొంగమాటలు నమ్మకుండా ప్రాణహిత చేవేళ్ళ ప్యాకేజి 21,21 పనులు పూర్తి చేయించాలని మంత్రులకు షబ్బీర్ విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతుల కోసం పథకాలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేయగా అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రభుత్వం రూ.లక్షా 40వేల కోట్ల వడ్డీ చెల్లించిందని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతుల కోసం పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
రైతుల ఓట్లతోనే కాంగ్రెస్ కు అధికారం

తమది రైతు ప్రభుత్వమని, రైతులు ఓటు వేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోంది. మళ్ళీ 90 సీట్లకు పైగా గెలుస్తామని అన్నారు. నిజాం సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో పూడిక తీత పనులు చేపట్టి నీటి నిలువ సామర్థ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచుకోవాలి
రైతు లు సాగు పెట్టుబడి ఖర్చలను తగ్గించుకొని పంట దిగుబడి పెంచే దిశగా ఆలోచించాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ శాఖ
రైతులను అప్పుల నుంచి బయటపడేయాలని కోరారు. రైతు భరోసా డబ్బులు తక్షణమే రైతుల ఖాతాల్లో వేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ప్యాకేజీ 21, 22 పనులను పూర్తి చేయాలి
ఉమ్మడి జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల 21, 22 ప్యాకేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని, రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయించాలని కోరారు.
రైతు మహోత్సవాన్ని మండలాల వారీగా నిర్వహించాలి
రైతు లేనిదే దేశం లేదని, రైతు మహోత్సవాన్ని మండలాల వారీగా నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఫసల్ బీమా యోజన బీఆర్ ఎస్ హయాంలో అమలు కాలేదని, ప్రస్తుతం అమలయ్యేలా చూడాలని కోరారు.

