బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని రైతు వేదికలో రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ చీల శంకర్ నేతృత్వంలో, కాంగ్రెస్ నేతలు, రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 16న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రైతు భరోసా కార్యక్రమాన్ని హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ చీల శంకర్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు శరత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు ఉచిత కరెంట్, రైతు భీమా, ఉచిత బస్సు సేవలు, ఇందిరమ్మ ఇండ్లలాంటి పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ముఖ్యంగా 9 రోజుల వ్యవధిలో రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఎన్నికల హామీలను నెరవేర్చినట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వసంత్, ఏవో సంతోష్, నాయకులు అంకు దాము, హరికాంత్ చారి, ఇమ్రాన్, ఆదినారాయణ, రాములు, కలీం, నవీన్, విష్ణువర్ధన్, చిత్రాల ప్రమోద్ (చిన్న), సాయి, మున్నా తదితర ప్రముఖులు, అధికారులు, రైతులు, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
