. . . భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించిన విద్యార్థులు
బాన్సువాడ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, పూలతో అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. బాలికలు తలపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించగా, డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ జానపద కళలను ప్రతిబింబించే పాటలు, నృత్యాలతో విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బోనాల వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ సంస్కృతిని గౌరవిస్తూ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజబాబు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

