. . . ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
. . . జనసంద్రంగా మారిన జుక్కల్
జుక్కల్, బతుకమ్మ :
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారం రోజులుగా ప్రచారం నిర్వహించారు. దానితో జుక్కల్ నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి తరలివచ్చారు. జుక్కల్ ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన బతుకమ్మ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు, నృత్యాలతో మార్మోగిన జుక్కల్ పార్టీలకు అతీతంగా తెలంగాణ సంస్కృతికి పట్టాభిషేకం ఎల్ కె ఆర్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ మహోత్సవం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగ జుక్కల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగింది.

జుక్కల్ మండల కేంద్రంలోని గుండూరు రోడ్డులో మంగళవారం నిర్వహించిన ఎల్ కెఆర్ బతుకమ్మ సంబరాలు 2026 మహిళల సందడి, బతుకమ్మ పాటలు, సంప్రదాయ నృత్యాలు,ఉత్సాహభరిత వాతావరణం మధ్య ఘన విజయాన్ని సాధించాయి.తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రం పండుగ శోభను సంతరించుకుంది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు, బతుకమ్మ పాటలకు అనుగుణంగా సాగిన నృత్యాలతో వేడుకల ప్రాంగణం కళకళలాడింది.

మహిళలు బతుకమ్మల చుట్టూ వలయాకారంగా చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ,ఆనందోత్సాహాలతో నృత్యాలు చేయడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళల భారీ భాగస్వామ్యంతో జుక్కల్ బతుకమ్మ సంబరాలు ప్రజల ఐక్యతకు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి. జుక్కల్ నియోజకవర్గ ఆడపడుచులతో ఆత్మీయంగా మమేకమైన ఎమ్మెల్యే సతీమణి మహిళలతో కలిసి స్వయంగా బతుకమ్మను పేర్చి,బతుకమ్మ పాటలు పాడుతూ, వారితో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో బతుకమ్మ మహోత్సవానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి,తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయ పండుగను ఘనంగా నిర్వహించడం విశేషంగా నిలిచిందన్నారు. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదని, తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయన్నారు.

