వెబ్ డెస్క్, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం అథ్మకూర్ గ్రామంలో గ్రామ పాలన అధికారి (జీపీఓ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అథ్మకూర్ గ్రామానికి చెందిన జీపీఓ మాతే రాజేష్ (37) పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అథ్మకూర్ గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నత రెవెన్యూ అధికారులకు సమర్పించేందుకు జీపీఓ రాజేష్ రూ.5 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారు నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టాలని నిందిత అధికారి ఫిర్యాదుదారుడికి సూచించినట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం ఆ బ్యాగ్ నుంచి రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షల్లో బ్యాగ్‌కు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్‌లోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
