. . . లేకపోతే భూ పోరాటం తప్పదు
. . . ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పూలంగ్ వాగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద ప్రజలకు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్.ఎస్.పి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ వాగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అనేక మంది కార్మికులు, కూలీలు అద్దె ఇళ్లలో నివసిస్తూ, తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల విద్యా ఖర్చులు భరించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి పేద ప్రజలకు ప్రభుత్వం తక్షణమే భూములు కేటాయించి గృహ నిర్మాణం చేపట్టాలని కోరారు. అదే విధంగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆక్రమించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేసి పక్కా ఇండ్లు నిర్మించాలని అన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను తన పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తూ పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకుని పేదలకు భూములు పంచాలని, లేకపోతే అర్హులైన పేదలతో కలిసి గుడిసెలు వేసి భూ పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ సింగ్ ఠాగూర్, ముకుందం, సయ్యద్ రఫీ ఉద్దీన్, టి. కృష్ణ, మహమ్మద్ నిజాముద్దీన్, పండరి, శ్రీనివాస్, ఆశ్రఫ్ ఉద్దిన్, అక్రమ్ ఖాన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.