- ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల హాస్పిటల్స్ కు తరలింపు
- ఓటి అసిస్టెంట్లు.. డాటా ఎంట్రీ ఆపరేటర్లే సూత్రదారులు
- జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేసుకుని దందా
- పీఆర్వోల ద్వారా అంబులెన్స్ ల డ్రైవర్లతో కలిసి పేషెంట్ల తరలింపు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కేరాఫ్ అనే నానుడి ఉంది. ఏడంతస్తుల మేడలో ట్రామా కేసులను కూడా విజయవంతంగా వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర ఉంది. జీజీహెచ్ లో మోకాళ్ళ, కీళ్ళ మార్పిడి మొదలుకుని హెడ్ ఇన్ జ్యూరి కేసులను కూడా వైద్యం చేసిన రికార్డు ఉంది. హైదరాబాద్ కు లేదా ప్రైవేట్ కు తరలించకుండానే ప్రభుత్వ ఆసుపత్రిలో అందిన వైద్య సేవలకు ఎన్నో ప్రశంసలు, రివార్డులు ఉన్నాయి. ఎందుకంటే వైద్యరంగంలో అత్యాధునిక వైద్య సేవలను జీజీహెచ్ లో అందించారు. ఆ రికార్డు గతంలో ఉన్న ప్రొఫెసర్లతో, అధికారులతో సాధ్యం అయింది. కానీ ప్రస్తుతం జీజీహెచ్ లో అర్థోసేవలంటే ప్రైవేట్ కే రిఫర్ అన్న రికార్డు నడుస్తోంది. ఆసుపత్రిలో ఎంఆర్ఐ లేదన్న సాకుతో రిఫర్ ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు అర్థోలో పేరెన్నికగన్నా ప్రొఫెసర్లు ఉన్నప్పుడు అందిన వైద్య సేవలు ఇప్పుడు జీజీహెచ్ లో అందడం లేదు. అందుకు సర్కారు దవఖానాకు వచ్చిన పేషెంట్ లు ప్రైవేట్ కు వెళ్లడమే. పేషెంట్లు ప్రైవేట్ కు వెళ్లకున్నా వారికి స్థోమత లేకపోయినా జీజీహెచ్ లో పని చేస్తున్న కొందరు అధికారుల ఆసుపత్రులకు ఇక్కడి నుంచి బదిలీ అయిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆసుపత్రులకు పేషెంట్లు తరలివెళ్లడమే అందుకు కారణం.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆసుపత్రులకు బదిలీ అయిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆసుపత్రులకు అర్థోపేషెంట్లు క్యూకట్టించి తరలిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం పని చేస్తున్న ఇద్దరు అధికారుల హయంలో 8 మందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టారు. అందులో కొందరు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కాగా మరికొందరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, నర్సింగ్ అధికారుల రూపంలో తిష్ట వేశారు. వారు నిత్యం ఆసుపత్రిలో వచ్చే కేసులను ఖలీల్ వాడిలోని ఒక అర్థో ప్రైవేట్ ఆసుపత్రికి, శ్రీనగర్ లోని మరో ఆసుపత్రికి పేషెంట్లను తరలించడంలో తలమునకలయ్యారు. అర్థోలో వారే అధికారులు కావడంతో డాక్టర్లు ఎంఆర్ఐ పేరుతో అత్యధికంగా ప్రైవేట్ కు పేషెంట్లు వెళ్లేలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శ్రీనగర్ లో గత మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన వైద్యుడు నిజామాబాద్ జీజీహెచ్ నుంచి బదిలీ అయినప్పటికీ అక్కడ పీఆర్ వోను, అంబులెన్స్ సిబ్బందిద్వారా పేషెంట్లను తన ఆసుపత్రికి తరలించడం విశేషం. మరో ఇద్దరు వైద్యులు ఒకేచోట ప్రాక్టీస్ చేస్తూ పేషెంట్లను తరలించుకపోవడం గమనార్హం.
నిజామాబాద్ జీజీహెచ్ కు పేదలకు ఉచిత వైద్యం అందించే ధర్మాసుపత్రిగా పేరుంది. అయితే కొందరు అధికారులు మాత్రం సొంత లాభం కోసం పేషెంట్లను ప్రైవేట్ కు రిఫర్ చేస్తున్నారని, తాము ప్రాక్టీస్ చేస్తున్న ఆసుపత్రులకే తరలించడంపై విమర్శలున్నాయి. గతంలో ఆసుపత్రిలో పని చేసిన అధికారులు సొంత ప్రాక్టీస్ మానుకుని అహర్నిశలు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకు పాటుపడితే వారిపై అబండాలు వేసి దుష్ప్రచారంతో ఆసుపత్రికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించారని ఆరోపణలు లేకపోలేదు. ఇంచార్జి అధికారుల పాలనలో ఆసుపత్రి పాలన వ్యవహరం గాడి తప్పింది. కొందరు షాడో సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండగా మరికొందరు సొంత ప్రాక్టీస్ కోసం ధర్మాసుపత్రి పేషెంట్లను తరలించడమేమిటని విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులను డమ్మీగా చేసి అంతా పాలన వ్యవహరాలను చక్కబెడుతున్నారని వారే పేషెంట్లను సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆసుపత్రులకు తరలించడం ఏమిటన్న వాదనలున్నాయి. బోధనాసుపత్రుల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దన్న నిబంధనలు తుంగలో తొక్కారు. తమ వద్ద జూనియర్లుగా పని చేస్తున్న పీజీ, ఎస్ఆర్ (సీనియర్ రెసిడెంట్)లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ద్వారా వైద్య సేవలు చేస్తూ కనీసం ఆపరేషన్లు కూడా సూపర్ వైజింగ్ చేయని పరిస్థితిలో అధికారులు ఉండడం గమనార్హం. ఆసుపత్రిలో సెక్షన్ల పేరిట జరుగుతున్న వైద్య సేవల్లో కనీసం జూనియర్లతో వైద్య సేవలు చేయించకపోవడంతో వారి స్థానంలో పేషెంట్ కేర్ సిబ్బంది వైద్యం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో డీఎంఈతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నజర్ వేస్తే కానీ పేషెంట్ల తరలింపు వ్యవహరం ఫుల్ స్టాఫ్ పడే అవకాశం లేదు.
