నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాణిక్ భవన్ పాఠశాల పదోవతరగతి 1972 – 73 పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు మాణిక్ భవన్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా, పూర్వ విద్యార్థిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులు సుబ్బారావు, కృష్ణారావును సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించి చిన్ననాటి మిత్రులను ఒక్కదగ్గరికి చేర్చిన ఆర్గనైజషన్ కమిటీని ముందుగా అభినందించారు. గోల్డెన్ జూబ్లీలో మిత్రులందరి కలయిక చూసి తన బాల్యపు రోజులను గుర్తు చేసుకున్నారు. 50 సంవత్సరాల నాటి విద్యారంభం నుండి నేటివరకు వరకు సాగిన తమ స్నేహం ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్లు తెలిపారు. తాము నేడు వివిధ రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే మాణిక్ భవన్ పాఠశాల అనే జ్ఞాన మందిరం, గురువులే కారణం అన్నారు. మాణిక్ భవన్ పాఠశాల తన విజయపథానికి తొలి అడుగు అని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరమని, అలాంటి పునాది తనకు మాణిక్ భవన్ పాఠశాల అని పేర్కొన్నారు. పాఠశాలలో నేర్చుకున్న విద్య, విలువలు, క్రమశిక్షణ ఇవన్నీ తన జీవితాన్ని తీర్చిదిద్దిన మూలస్తంభాలుగా నిలిచాయన్నారు. నేడు తను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగగలగడం, అలాగే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడిగా ప్రజల సేవలో ఉండగలగడం,తన గురువుల ఆశీర్వాదం, పాఠశాల ఇచ్చిన మార్గదర్శకత వల్లే సాధ్యమైందని తెలిపారు. తమ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను చూసాం అని ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నుండి ఈనాటి మోడీ గారి సంక్షేమ పాలన వరకు అన్నీ చూస్తూ వస్తున్నాం అన్నారు. తమకు ఉన్న అనుభవాన్ని జ్ఞానాన్ని చుట్టూ ఉన్న సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలి అనేది ఈ వయసులో ముఖ్యమైన ఘట్టంగా పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలలో సేవలందించడం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, గోసేవ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలన్నారు. ముఖ్యంగా తమ అనుభవంతో సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలని యువతను సరైన మార్గంలో నడిపిస్తున్న వారిని అన్ని రంగాలలో రాణించేల ప్రోత్సహించలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, గౌతమ్,మోహన్ పాటోళ్ల, చిన్న రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
1452
