. . . జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్
కామారెడ్డి, బతుకమ్మ :
గోదావరి జలాలను కామారెడ్డి జిల్లాకు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 22వ ప్యాకేజీ పనులను తక్షణమే ప్రారంభించాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాలలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో పలువురు ఇంజినీర్లు, రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ ఇంజనీర్ గోపాల్ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిధుల కొరత కారణంగానే 22వ ప్యాకేజీ పనులు ముందుకు సాగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 21, 22 ప్యాకేజీలలో మార్పులు చేసినప్పటికీ, గత ప్రభుత్వం తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. కేవలం రూ.2,000 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, రైతాంగం ఉద్యమిస్తేనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా ఖర్చు చేసినప్పటికీ కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. ఈ ప్రాంత రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల కోసం ప్రజలు, రైతులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. హన్మండ్లు మాట్లాడుతూ, 2005లో బీబీపేట చెరువు నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు నిర్వహించిన పాదయాత్రను గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి గోదావరి జలాలే కీలకమని, 22వ ప్యాకేజీ పూర్తైతే రైతులు సుభిక్షంగా జీవించగలరని పేర్కొన్నారు. జలసాధన సమితి కన్వీనర్ జగన్నాథం మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతానికి నీళ్లు రావని చెప్పిన నాయకులే ఇప్పుడు తాగునీరు, సాగునీటి అవసరాన్ని గుర్తిస్తున్నారని అన్నారు. గోదావరి జలాల సాధన కోసం కృషి చేసిన షబ్బీర్ అలీ ప్రయత్నాలను అభినందిస్తూ, 22వ ప్యాకేజీకి తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కో-కన్వీనర్ ఫిరంగి రాజేశ్వరి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రైతుల ప్రయోజనాల కోసం మండల కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మరో కన్వీనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. 22వ ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఎల్ఎఫ్ జిల్లా నాయకుడు సిరిగాడ సిద్ధరాములు, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ పీవీఎస్‌ఎన్ రాజు, కె. శ్రీనివాస్, పి. ఆంజయ్య, వెంకటలక్ష్మి, అనసూయతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
