. . . రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్
. . . 24 గంటల ఉచిత కరెంట్‌ను ఎగ్గొట్టేందుకు ఈ ప్రత్యేక రైతు డిస్కం
. . . సీఎం చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలు నెరవేర్చడనే విషయం ప్రజలకు అర్థమైంది
హైదరాబాద్, బతుకమ్మ :
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం రైతులకున్న ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కం తీసుకొస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి, సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే రైతన్నలకు ఉచిత కరెంట్ విద్యుత్ సరఫరాను ఆపేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపించారు. కేవలం రైతన్నలకున్న 24 గంటల ఉచిత కరెంట్‌ను ఎగ్గొట్టేందుకే ఈ ప్రత్యేక రైతు డిస్కం అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ను రైతన్నలకు అందకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. కానీ లోపల ఇంతటి దారుణమైన రైతు వ్యతిరేక కుట్రను దాచుకొని, పైకి మాత్రం ఉచిత కరెంట్ కోసమే ప్రత్యేక రైతు డిస్కం తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతుల మీద అంతే ప్రేమ ఉందన్నారు. రేవంత్ రెడ్డి ‘రైతు డిస్కం’ అంటే రైతన్న మెడకు ఉరి పెట్టినట్టేనన్నారు. రైతు డిస్కం ద్వారా ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ రైతన్నలపై జరుగుతున్న ఈ కుట్రను నగరంలో ఉన్న తెలంగాణ పౌరులు కూడా వ్యతిరేకించి వారికి అండగా నిలవవలసిన అవసరం ఉందన్నారు.

రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలు నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కేటీఆర్ అన్నారు. అందుకే ఈరోజు రైతు డిస్కం పైన రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నీ ముమ్మాటికీ అబద్ధాలేనన్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు పరచకుండా, తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు, రైతన్నలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంట్ కోతలను పూర్తిగా తీర్చేలా చేసింది కేసీఆర్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ కరెంట్ కోతలు ఎంత తీవ్రంగా ఉండేవో గుర్తు చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. కరెంట్ కోసం రైతన్నలతో పాటు చివరికి పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలకు హాలిడేలు ప్రకటించి, పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితిని మర్చిపోవద్దన్నారు. అంతటి దుస్థితి నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని పనిని చేసి, 24 గంటల కరెంట్ రాష్ట్రానికి అందించిన నాయకుడు ముమ్మాటికీ కేసీఆర్ అన్నారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కానీ కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానన్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నలకు ఇచ్చే 24 గంటల కరెంట్‌ను కూడా ఆపే కుట్ర చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంగా పొంగులేటి లాంటి మంత్రులు వచ్చి 6,000 ఇండ్లు కంటోన్మెంట్‌కు ఇస్తామని చెప్పిన మాటను గుర్తు చేస్తూ, రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత కనీసం ఒక్క ఇంటిని కూడా కంటోన్మెంట్‌కు, హైదరాబాద్ నగర ప్రజలకు ఇవ్వలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరానికి అద్భుతమైన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జ్‌లు, 20,000 లీటర్ల ఉచిత తాగునీరు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవో 58, 59 ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ భూములను అందించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దే అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేదల ఇండ్లపై పడి ‘హైడ్రా’ భూతంతో వేలాదిమంది ఇండ్లను కూలగొడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కంటోన్మెంట్‌లో ఉన్న రక్షణ శాఖ భూములు ఇస్తే, అటు కరీంనగర్ వైపు, నిజామాబాద్ వైపు స్కైవేలు నిర్మాణం చేస్తామని పదులసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఏనాడూ స్పందించలేదన్నారు. చివరికి అప్పటి ప్రభుత్వ ఒత్తిడి మొన్న ఫలించిందని కేటీఆర్ అన్నారు. దీంతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆర్మీ అధికారులు అడ్డగోలుగా రోడ్లను ఎప్పటికప్పుడు బంద్ చేస్తే, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీర్చామని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరానికి అప్పటి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని అన్ని సీట్లలో బీఆర్ఎస్‌ను గెలిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశం మొత్తం తిరస్కరిస్తే… తెలంగాణలో ఆ దరిద్రం తిరిగి వచ్చిందన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బహుముఖ పోటీ ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు మన్నె క్రిశాంక్, గజ్జల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

