. . . జర్మనీలో భారతీయ యువకుడి అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
అమెరికాలో 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లో జరిగిన ఈ హత్య అనంతరం నిందితుడు అమెరికా నుంచి జర్మనీకి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. టక్సన్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని జులిస్సా రూబీ సలాజర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అపార్ట్ మెంట్‌కు వెళ్లి పరిశీలించగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్య సిబ్బంది పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ఆరోపణల ప్రకారం.. సలాజర్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆమె ప్రియుడు వరుణ్ బట్చిగారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో మృతురాలికి చెందిన ఫోన్, క్రెడిట్ కార్డులను వరుణ్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి భారత్‌కు వెళ్లేందుకు అతడు ప్రయత్నించినట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో వరుణ్‌పై అమెరికా అధికారులు ఫస్ట్ – డిగ్రీ హత్య, కిడ్నాప్ ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అనంతరం జర్మనీ అధికారులతో సమన్వయం చేసుకుని అతడిని బెర్లిన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వరుణ్ జర్మన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని అరిజోనా రాష్ట్రానికి అప్పగించేందుకు అమెరికా, జర్మనీ అధికారులు తదుపరి న్యాయపరమైన ప్రక్రియను కొనసాగి స్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

