. . . ఐఎఫ్టీయు నగర ప్రధాన కార్యదర్శి ఎం.శివ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఐఎఫ్టీయు నగర ప్రధాన కార్యదర్శి ఎం.శివకుమార్ అన్నారు. ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల హోల్ సెల్ మార్కెట్ కార్మికుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం నెలకి రూ.30 వేలు చెల్లించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామపంచాయతీ, స్కీమ్ వర్కర్స్ అందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం.మోహన్ మాట్లాడుతూ కార్పొరేటు కంపెనీలకు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. లేబర్ కోడ్స్ వలన కార్మికులు హక్కులు కోల్పోయి కట్టుబానిసలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వకీల్ మతిన్, హమాలి కార్మికుల నాయకులు వీరయ్య, లచ్చిరాం, గణేష్, శంకర్, సంజు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సాజిత్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.