- రెండు గంటల్లోనే కేసు ఛేదన
- ఏసీపీ రాజావెంకట్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఐదోటౌన్ పరిధిలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసి చోరీ చేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. ఐదో టౌన్ పరిధిలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన మోరా అనిత ఈనెల 29న తన ఇంట్లో ఎవరో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి బంగారం అమ్మే నెపం తో వచ్చి ఐదు లక్షల డబ్బు ను దొంగిలించారు అని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిజామాబాదు డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ ఎల్.రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు టీం లుగా ఏర్పడి బి.శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఐదో టౌన్ ఎస్ఐ ఎం. గంగాధర్, సిబ్బంది కేసును వివిధ కోణాలలో పరిశోధించారు. దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన తురుక శివయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు అంకమ్మ, తన్నీరు గంగారాజు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ బంగారాన్ని తీసుకుని వచ్చి నగరంలోని శీవాజీ నగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. నకిలీ బంగారం అమ్మే క్రమంలో సీతారాం నగర్ కు చెందిన మోరా అనిత ను పాల కేంద్రం వద్ద పాలు కొనేనెపంతో పలుమార్లు సంప్రదించారు. తమ వద్ద 350గ్రాముల బంగారం బిస్కెట్ ఉందని, అది బయట అమ్మితే రూ.30లక్షల వరకు వస్తుందని నమ్మించారు. కానీ మీకు రూ.10లక్షలకే ఇస్తామని అన్నారు. దానికి అనిత సమ్మతించి తమ వద్ద రూ.5లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అందుకు సరేనని అంగీకరించి రూ.5లక్షలు తీసుకుని నకిలీ బంగారం బిస్కెట్ ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నారు. తర్వాత ఫిర్యాదుకి అనుమానం వచ్చి బంగారాన్ని పరీక్షించుకోగా అది నకిలీ అని తేలడంతో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం తో పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాలలో విచారించగా నిందితులు డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారనే పక్కా ఇన్ఫర్మేషన్ తో వెళ్లి తనిఖీ చేయగా అక్కడ పోలీసు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5లక్షల నగదు, 960గ్రాముల నకిలీ బంగారం, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి అభినందిoచారు.

