ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆలియాస్ సత్యం బుధవారం తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు..తన వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా పత్రాన్ని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ కి అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతు.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అనుమతి మేరకే రాజీనామా చేసినట్లు తెలిపారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ కార్యకర్తను తాను కొన్ని అనివార్య కారణాలవల్ల టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సేవా పథకాలు ఉచిత అంబులెన్స్ సౌకర్యం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, అభివృద్ది లాంటి కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ నుండి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పని చేసాను అని అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ స్టాండ్, చిల్డ్రన్ పార్క్, సెంటర్ లైటింగ్, 32 కమ్యూనిటీ హాల్లు, వైకుంఠ ధామం, వైకుంఠ రథం, సీసీ రోడ్లు,పల్లె ప్రకృతి వనాలు, బస్తీ దవాఖానాలు, వంటి అభివృద్ధి పనులు అన్ని తన హయాంలో చేసాను అని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా వున్నప్పుడు తనకు సహకరించిన పారిశుద్ధ్య కార్మికులకు, ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితావెంకట్రాం రెడ్డి, మాజీ జడ్పీటీసీ సామెల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు, సొసైటీ డైరెక్టర్ గంగారెడ్డి, నాయకులు, అనుచరులు ఉన్నారు.
కౌన్సిలర్ పదవికి ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మెన్ సత్యం రాజీనామా
