. . . కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీష్ రావు
. . . మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్
బాన్సువాడ, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు కలిసి కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ జెండాను చేతబట్టినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని పేర్కొన్నారు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి ప్రతి జిల్లాను సందర్శిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరిచిన నాయకుడని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్, ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం చూపుతున్న చిత్తశుద్ధి, అంకితభావం, సేవాతత్పరత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. హరీష్ రావు ఆయురారో గ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ రైతు బందు అధ్యక్షులు అంజిరెడ్డి, కామారెడ్డి జిల్లా ఏఐబిఎస్ ఉపాధ్యక్షులు బోడ రామ్ చందర్, బీఆర్ఎస్వి మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా, కౌన్సిలర్లు మాక్బూల్, ఫెరోజ్ ఖాన్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇషాక్, షారు, నాయకులు రమేష్ యాదవ్, అతిఫ్ అజిమ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

